Covid: మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
ABN , First Publish Date - 2023-03-22T13:27:03+05:30 IST
రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌లు మళ్ళీ అధికమవుతుండటంతో అత్యవసర చర్యలు చేపట్టే విషయమై ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం(Minister M. S
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌లు మళ్ళీ అధికమవుతుండటంతో అత్యవసర చర్యలు చేపట్టే విషయమై ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం(Minister M. Subramaniam) సచివాలయంలో వైద్యనిపుణులతో మంగళవారం ఉదయం సమావేశమాయ్యరు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కరోనా కేసులు పెరిగినా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మునుపటిలా కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చే అవకాశం లేదని, ప్రస్తుతం రూపుమార్చుకున్న కరోనా వైరస్ వల్ల కేసుల సంఖ్య కాస్త పెరిగి ఉంటుందని వైద్యనిపుణులు చెప్పారన్నారు. కరోనా వ్యాప్తి కట్టడికి ప్రజల సహకారం చాలా అవసరమని, ఇందులో భాగంగా కరోనా నిరోధక నిబంధనలు పాటిస్తేచాలని మంత్రి చెప్పారు. ముఖాలకు మాస్కులు ధరిస్తే కరోనా, వైరల్ జ్వరం రాకుండా ఉంటుందన్నారు. అదే విధంగా తరచూ చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా కేసుల పెరుగుదలను తేలికగా తీసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోందని చెప్పారు. రెండేళ్ల విరామం తర్వాత రాష్ట్రంలో మళ్ళీ కరోనా కేసులు అధికమవుతుండటం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సోమవారం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య హఠాత్తుగా 76కు పెరగడం ఆందోళన కల్గించేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.