నకిలీ జీపీఎస్.. దారిమళ్లిన 20 విమానాలు
ABN , First Publish Date - 2023-10-02T05:12:23+05:30 IST
అది అసలే ఉద్రిక్తతలకు నెలవైన ప్రాంతం.. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. అలాంటిచోట విమానాలు దారిమళ్లడం పెద్ద చర్చనీయాంశం అవుతోంది.
ఇరాన్-ఇరాక్ గగనతలంలో 15 రోజుల్లో పలు ఘటనలు
ముంబై, అక్టోబరు 1: అది అసలే ఉద్రిక్తతలకు నెలవైన ప్రాంతం.. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. అలాంటిచోట విమానాలు దారిమళ్లడం పెద్ద చర్చనీయాంశం అవుతోంది. ఒకటీ, రెండు కాదు 15 రోజుల వ్యవధిలో ఏకంగా 20 సర్వీసులు పక్కదారి పట్టిన ఉదంతం ఇరాన్-ఇరాక్ గగనతలంలో చోటుచేసుకుంది. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) సిగ్నల్ స్పూఫింగ్ దీనికి కారణమని ప్రాథమికంగా తేలింది. విమానాల ఉపగ్రహ సంకేతాలను అడ్డుకుని నకిలీ సంకేతాలను పంపి నావిగేషన్ వ్యవస్థనూ ప్రభావితం చేయగల శక్తి ఈ స్పూఫింగ్ సొంతం. ఇలా దారిమళ్లిన విమాన సర్వీసుల్లో బోయింగ్ 777, 737, 747, ఎంబ్రార్ లెగసీ 650 ఉన్నాయి. ఇదే గగనతలం మీదుగా భారత్‌కు చెందిన ఎయిరిండియా, ఇండిగో, విస్తారా సర్వీసులు శాన్‌ఫ్రాన్సిస్కో (అమెరికా), లండన్ (యూకే), బాకూ (అజర్‌బైజాన్), అంకారా (తుర్కియే)లకు వెళ్తుంటాయి. అయితే, అవి దారితప్పాయా? లేదా అని బయటకు రాలేదు. గతంలోనూ విమానాల దారిమళ్లింపు ఉదంతాలు జరిగినా.. అవి పౌర విమానాలు కాదు. ఈ నేపథ్యంలో ఇరాన్ గగనతలం నుంచి వెళ్లే మార్గం (యూఎం688)లో అప్రమత్తంగా ఉండాలంటూ అమెరికా హెచ్చరికలు జారీచేసింది. కాగా, ఈ మార్గంలో భారత మిమానాలు వెళ్లడం లేదు. మరోవైపు ఇరాన్‌లోని కుర్దిస్థాన్ సరిహద్దుల్లో ఇరాన్, ఇరాక్ బలగాలను మోహరించాయి. వీటితో పాటు ఉత్తర ఇరాక్‌లోని అమెరికా బలగాలు, ఇటీవల సరిహద్దుల్లో బలగాలను పెంచిన తుర్కియే వద్ద కూడా సిగ్నల్ జామింగ్, స్పూఫింగ్ వ్యవస్థలున్నాయి. ఇక కొద్ది రోజులుగా అర్మేనియా-అజర్‌బైజాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలోనూ ఇరాన్ సరిహద్దుల్లో పహారాను పటిష్ఠం చేసింది. ఇరాన్ లానే అర్మేనియా, అజర్ బైజాన్‌కూ సిగ్నల్ జామింగ్, స్పూఫింగ్ చేయగల సామర్థ్యం ఉండడం గమనార్హం.