Delhi Excise policy case: అమన్ దీప్‌కు 5 రోజుల ఈడీ కస్టడీ‌

ABN , First Publish Date - 2023-03-02T22:22:09+05:30 IST

అమన్ దీప్‌ను 5 రోజుల ఈడీ కస్టడీ‌కి సీబీఐ స్పెషల్ కోర్ట్ అప్పగించింది.

Delhi Excise policy case: అమన్ దీప్‌కు 5 రోజుల ఈడీ కస్టడీ‌
Delhi Excise policy case

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు(Delhi Excise policy case)లో వ్యాపారవేత్త అమన్ దీప్ సింగ్‌ను అరెస్ట్ చేసిన ఈడీ(ED) అధికారులు రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు (Rouse Avenue Court)లో ప్రవేశ పెట్టారు. అమన్ దీప్‌ను 5 రోజుల ఈడీ కస్టడీ‌కి సీబీఐ స్పెషల్ కోర్ట్ అప్పగించింది. అమన్ దీప్ సింగ్‌కు సౌత్ గ్రూప్‌తో సంబంధాలు ఉన్నాయని ఈడీ అధికారులు ఆరోపించారు.

మరోవైపు హైదరాబాద్‌కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబు గోరంట్ల (CA Butchi Babu Gorantla) బెయిల్ పిటిషన్‌పై నిర్ణయాన్ని రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు (Rouse Avenue Court) వాయిదా వేసింది. సీబీఐ (Central Bureau of Investigation) ఫిబ్రవరి 8న బుచ్చిబాబును అరెస్టు చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వద్ద గోరంట్ల బుచ్చిబాబు కొంతకాలం ఆడిటర్‌గా పని చేశారు. బుచ్చిబాబును ప్రశ్నించేందుకు ఈడీ ఇటీవల అనుమతి పొందింది.

అటు ఈ కేసులో ఐదుగురు నిందితులకు బెయిల్ లభించింది. కుల్దీప్‌సింగ్‌, నరేంద్రసింగ్‌, అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లై, ముత్తా గౌతమ్, సమీర్‌ మహేంద్రులకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. సిబిఐ నమోదు చేసిన కేసు తొలి చార్జ్ షీట్‌లో ఏడుగురి నిందితులపై అభియోగాలు మోపింది. తొలి చార్జ్ షీట్‌లో సమీర్ మహేంద్రు, అభిషేక్ ,విజయ్ నాయర్, కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్, అరుణ్ రామచంద్రన్ పిళ్లై, ముత్తా గౌతమ్ నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం ఈడి కేసులో సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి తీహార్ జైల్లో ఉన్నారు. ప్రస్తుతం ఈడీ నమోదు చేసిన కేసులో ముగ్గురు నిందితులు జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. ఇప్పటికే సిబిఐ నమోదు చేసిన కేసులో విజయ్‌ నాయర్‌, అభిషేక్‌ బోయినపల్లి బెయిల్‌ పొందారు. కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్, అరుణ్ రామచంద్రన్ పిళ్లై, ముత్తా గౌతమ్‌లను అరెస్టు చేయకుండానే సీబీఐ ప్రత్యేక కోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. అరుణ్ పిళ్ళైని ఈడీ ఇటీవలే ప్రశ్నించింది.

ఇదే కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలని సుప్రీం స్పష్టం చేసింది. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇప్పటికే సిసోడియాను ఐదు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహల ధర్మాసనం విచారణ చేపట్టింది. సిసోడియా తరఫున అభిషేక్‌ మను సింఘ్వి వాదనలు వినిపించారు. సిసోడియా అరెస్టు అక్రమమన్నారు. ఆయన పేరు సీబీఐ చార్జిషీటులో లేదని, సోదాల్లో కూడా లెక్కలు చూపని నగదు ఏమీ దొరకలేదని చెప్పారు. విచారణకు సహకరించడం లేదన్న సీబీఐ ఆరోపణ చాలా బలహీనమైన సాకు అని తెలిపారు. వాదనలు విన్న సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ స్పందిస్తూ.. ‘‘మా తలుపులు తెరిచే ఉంటాయి. కానీ, ప్రస్తుత దశలో ఈ పిటిషన్‌ను విచారించేందుకు సిద్ధంగా లేం. హైకోర్టుకు వెళ్లండి’’ అని చెప్పారు.

Updated Date - 2023-03-02T22:22:12+05:30 IST