Rains: ఉత్తరాదిలో ఆగని వర్ష బీభత్సం

ABN , First Publish Date - 2023-07-11T03:42:21+05:30 IST

భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో ఉత్తరాది రాష్ట్రాలు గజగజ వణికిపోతున్నాయి. వర్ష బీభత్సంతో గత మూడు రోజుల్లో వేర్వేరు ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 37కు చేరింది.

Rains: ఉత్తరాదిలో ఆగని వర్ష బీభత్సం

37కు చేరిన మృతుల సంఖ్య.. పొంగిపొర్లుతున్న నదులు

ఢిల్లీలో ప్రమాదకరంగా యమున.. హిమాచల్‌ కకావికలం

విరిగిపడిన కొండచరియలు.. వరద ఉధృతికి విరిగిన బ్రిడ్జిలు

జమ్మూ నుంచి అమర్‌నాథ్‌ యాత్ర నిలిపివేత

రాజస్థాన్‌ మౌంట్‌ అబూలో 23 సెం.మీ. వర్షం

న్యూఢిల్లీ, జూలై 10: భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో ఉత్తరాది రాష్ట్రాలు గజగజ వణికిపోతున్నాయి. వర్ష బీభత్సంతో గత మూడు రోజుల్లో వేర్వేరు ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 37కు చేరింది. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, హరియాణా, జమ్మూ కశ్మీర్‌, రాజస్థాన్‌, యూపీ, ఢిల్లీలో మరో రెండు రోజులు కుండపోత వానలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రాష్ట్రాల్లో యుమునతో పాటు ఇతర నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలు పట్టణాలు, నగరాలు జలమయమయ్యాయి. సహాయ చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో పాటు ఆర్మీని రంగంలోకి దింపారు. హిమాచల్‌లో పరిస్థితి భయానకంగా ఉంది. వరద ఉధృతి, కొండచరియలు విరిగిపడి ఇళ్లు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల దుకాణాలు, వాహనాలు వరద ఉధృతిలో కొట్టుకుపోయాయి. పర్యాటక ప్రదేశమైన మనాలీలో చిక్కుకుపోయిన 29 మందిని ఎన్టీఆర్‌ఎఫ్‌, పోలీసులు కాపాడారు. ఇంకా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 400 మంది చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. బడ్డీ, కుల్లూ, ఉనా ప్రాంతాల్లో బ్రిడ్జిలు విరిగిపోయాయి. లార్జి పవర్‌ ప్రాజెక్టు మునిగిపోయింది.

2army.jpg

ఓ ఇల్లు కూలిపోయి ఓ నేపాలీ కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. ఈ దుర్ఘటన వీడియో వైరల్‌ అయింది. రాష్ట్రంలో గత 50 ఏళ్లలో ఇలాంటి కుంభవృష్టిని చూడలేదని హిమాచల్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడడంతో పలు మార్గాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి. చార్‌ధామ్‌ యాత్ర కోసం వెళ్లిన వేలాది మంది భక్తులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారి రాంబన్‌ వద్ద తీవ్రంగా దెబ్బతింది. దీంతో జమ్మూ నుంచి అమర్‌నాథ్‌ యాత్రను వరసగా మూడో రోజు కూడా నిలిపివేశారు. జమ్మూలో 6 వేల మందికి పైగా యాత్రికులు ఆగిపోయారు. భగవతి బేస్‌ క్యాంప్‌ దగ్గరే 5 వేల మందికి పైగా ఉన్నారు. పంజాబ్‌లో జల దిగ్బంధంలో చిక్కుకున్న ఓ యూనివర్సిటీ నుంచి 1000 మంది విద్యార్థులు, సిబ్బందిని ఆర్మీ సురక్షిత ప్రాంతానికి తరలించింది. ఢిల్లీలో యుమునా నది పరవళ్లు తొక్కుతోంది.

4.jpg

హరియాణా హథినీకుండ్‌ బ్యారేజీ నుంచి మరింత నీటిని విడుదల చేయడంతో యుమున 204 మీటర్ల మార్కు దాటింది. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రమాదకర స్థాయిగా పరిగణించే 205 మీటర్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు రోజుల తర్వాత సోమవారం ఢిల్లీలో వర్షం తెరిపిచ్చింది. అయితే అనేక ప్రాంతాల్లో రోడ్లపై మోకాలి లోతు వర్షపు నీరు నిలిచిపోయి ఉండడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. రాజస్థాన్‌లో కుంభవృష్టితో జన జీవనం స్తంభించింది. సిరోహీ జిల్లాలోని మౌంట్‌ అబూలో 23.1 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రాజధాని జైపూర్‌లో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. గుజరాత్‌లో రెండో రోజు సోమవారం కూడా భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో 8 గంటల వ్యవధిలో 10 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా 37 రిజర్వాయర్లకు హై అలర్ట్‌ ప్రకటించారు. హిమాచల్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, హరియాణాల్లో సహాయ చర్యల కోసం 39 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపినట్టు ఆ విభాగం ప్రతినిధి తెలిపారు. వీరితో పాటు ఆయా రాష్ట్రాల్లో ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సేవలందిస్తున్నాయి. ప్రధాని మోదీ సోమవారం హిమాచల్‌, ఉత్తరాఖండ్‌ సీఎంలతో మాట్లాడి సహాయం అందిస్తామని చెప్పారు.

2rescue.jpg


హిమాచల్‌లో కోర్టుల మూత

భారీ వర్షాలు, వరదల కారణంగా ఉత్తర భారతదేశంలో కోర్టులు, ట్రైబ్యునళ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో సోమవారం కోర్టులను మూసే ఉంచగా.. మరికొన్ని రాష్ట్రాల్లో న్యాయవాదులు, ప్రతివాదులు విచారణకు హాజరవ్వకపోయినా ఏ చర్యలు తీసుకోబోమని కోర్టులు తెలిపాయి. వర్షాలతో హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు తెరవలేదు. అలాగే ఆ రాష్ట్రంలోని అన్ని కోర్టులను కూడా మూసే ఉంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటు ఢిల్లీలోని నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్సీఎల్టీ) భౌతిక విచారణలు రద్దు చేసి వర్చువల్‌గా విచారణలు చేపట్టింది. ఇటు సుప్రీంకోర్టు, నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌, ఢిల్లీ హైకోర్టు.. ‘‘వర్షాల కారణంగా సోమవారం విచారణలకు హాజరవ్వలేకపోయిన న్యాయవాదులకు వ్యతిరేకంగా ప్రతికూల ఉత్తర్వులు జారీ చేయబోం’’ అని వేర్వేరుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి.

అచ్చం పదేళ్ల క్రితం విపత్తు లాగే!

2013 ఉత్తరాఖండ్‌ వరదల తరహాలోనే ఇప్పుడు..

న్యూఢిల్లీ, జూలై 10: హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రస్తుతం అతలాకుతలం సృష్టిస్తున్న వరదలకు, 2013లో ఉత్తరాఖండ్‌లో భీభత్సం సృష్టించిన వరదలకు మధ్య చాలా ఆశ్చర్యకరమైన సారూప్యతలున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తాజాగా వెల్లడించింది. ఇన్‌శాట్‌ తీసిన తాజా ఉపగ్రహ చిత్రాల్లో ఈమేరకు తేలిందని పేర్కొంది. పదేళ్ల క్రితం సంభవించిన వరదలు కేదార్‌నాథ్‌లో విలయం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా కూడా ఢిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్‌లలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. మధ్యధరా ప్రాంతంలో పుట్టే తుఫానులతో వర్షాకాల గాలులు కలవడంతో హిమాచల్‌ ప్రాంతంలో భారీ వర్షాలకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయని ఐఎండీ స్పష్టం చేసింది. 2013లోనూ అచ్చం ఇదే పరిస్థితి నెలకొందని వివరించింది. మరో 36 గంటలపాటు ఇది కొనసాగుతుందని తెలిపింది.

Updated Date - 2023-07-11T04:41:39+05:30 IST