Manoj Tiwari: సిసోడియాను చంపేందుకు కేజ్రీ కుట్ర?...బీజేపీ ఎంపీ అనుమానాలు

ABN , First Publish Date - 2023-03-08T20:30:09+05:30 IST

తీహార్ జైలులో మనీష్ సిసోడియా ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఆరోపణలను..

Manoj Tiwari:  సిసోడియాను చంపేందుకు కేజ్రీ కుట్ర?...బీజేపీ ఎంపీ అనుమానాలు

న్యూఢిల్లీ: తీహార్ జైలులో మనీష్ సిసోడియా (Manish Sisodia) ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చేసిన ఆరోపణలను బీజేపీ అంతే ఘాటుగా తిప్పికొట్టింది. ఢిల్లీ జైళ్లు ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోకే వస్తాయని, అంటే కేజ్రీవాల్ పరిధిలోకే వస్తాయని, అరవింద్ కేజ్రీవాల్ సీక్రెట్లనీ ఆయన సన్నిహితుడైన సిసోడియాకు బాగా తెలుసునని బీజేపీ ఎంపీ మనోజ్ తివారి అన్నారు. ఆ సీక్రెట్లు బయటపడకుండా మనీష్ సిసోడియాను చంపేందుకు కేజ్రీవాల్ కుట్ర పన్నుతున్నారా? అని ప్రశ్నించారు.

''కేజ్రీవాల్‌గా బాగా సన్నిహితుడు సిసోడియా. కేజ్రీవాల్ రహస్యాలన్నీ ఆయనకు తెలుసు. అవి బయటకు రాకుండా ఆయన్ని కేజ్రీవాల్ చంపాలనుకుంటున్నారా? జైలులో ఉన్న సిసోడియా ప్రాణాలకు ముప్పు ఎలా ఉంటుంది? బీజేపీ నుంచే ముప్పు ఉందంటూ అపోహలు కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సిసోడియాకు సాధ్యమైనంత గట్టి భద్రత ఇవ్వాలని తీహార్ జైలు అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను'' అని మనోజ్ తివారీ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.

జైలు అధికారుల భరోసా

మరోవైపు, తీహారు జైలు సెల్‌లో కరడుకట్టిన నేరస్థులతో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఉంచినట్టు ఆప్ చేసిన ఆరోపణలను సైతం జైలు అధికారులు ఖండించారు. సిసోడియా భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకమైన వార్డు ఆయనకు కేటాయించినట్టు తెలిపారు. సీజే-1 వార్డులో సిసోడియా ఉంటున్నారని, ఇది తక్కువ మంది ఖైదీలున్న వార్డు అని చెప్పారు. ఇందులో ఉంటున్న వారు గ్యాంగ్‌స్టర్లు కాదనీ, పైగా జైలులో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలని వివరణ ఇచ్చారు. సిసోడియాకు ప్రత్యేక సెల్ ఇచ్చామని, అందులో ఆయన నిరాఘాటంగా ధ్యానం, ఇతర కార్యక్రమాలు చేసుకోవచ్చని తెలిపారు. జైలు నిబంధనల ప్రకారం, ఆయన భద్రతకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేశామని, ఎవరికీ ఎలాంటి ఆందోళనలు అవసరం లేదని అని జైలు అధికారులు తెలిపారు.

Updated Date - 2023-03-08T20:30:09+05:30 IST