JDS chief: తేల్చేశారు... ఎన్డీయేతో చేతులు కలిపే ప్రశ్నేలేదు..
ABN , First Publish Date - 2023-10-18T12:42:22+05:30 IST
బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో ఎట్టిపరిస్థితిలోనూ చేరబోమని, జేడీఎస్ లౌకిక సిద్ధాంతాలకే కుట్టుబడి ఉంటామని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో ఎట్టిపరిస్థితిలోనూ చేరబోమని, జేడీఎస్ లౌకిక సిద్ధాంతాలకే కుట్టుబడి ఉంటామని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం(CM Ibrahim) ప్రకటించారు. బెంగళూరులో సోమవారం పార్టీ మైనార్టీ నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై తాజా పరిణామాల గురించి చర్చించారు. బీజేపీతో పొత్తు అం శాన్ని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి(Former Chief Minister HD Kumaraswamy) ఢిల్లీలో ఏకపక్షంగా ప్రకటించారని, దీనికి తాము సమ్మతించబోమని ఇబ్రహీం అనంతరం మీడియాకు తెలిపారు. తమిళనాడు, బీహార్, ఒడిశా జేడీఎస్ విభాగాలు కూడా బీజేపీతో పొత్తును తీవ్రంగా వ్యతిరేకించిన సంగతిని ఆయన గుర్తుచేశారు. ఇక మిగిలిన కర్ణాటక శాఖలో కూడా ఈ అంశంపై తీవ్రస్థాయిలో భిన్నాభిప్రాయాలున్నాయని ఇబ్రహీం పేర్కొన్నారు. జేడీఎ్‌సకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలతోనూ తాను ఇదే అంశంపై చర్చించానని, వీరిలో అత్యధికులు బీజేపీతో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. మాజీ ప్రధాని, పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ అనారోగ్యాన్ని ఆసరాగా తీసుకుని కుమారస్వామి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన ఆక్రోశం వ్యక్తంచేశారు. చెన్నపట్టణలో 20వేల మంది ముస్లింలు ఓట్లు వేస్తేనే కుమారస్వామి గెలుపొందారని, ఈ సంగతిని ఆయన గుర్తెరిగితే మంచిదని ఇబ్రహీం హితవు పలికారు. త్వరలో పార్టీ కోర్ కమిటీని సమావేశపర్చి తదుపరి కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు. సభలో పాల్గొన్న ప్రతినిధులు పార్టీ నేతలంతా ఇండియా కూటమిలో చేరాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారన్నారు. కాగా బీజేపీతో పొత్తు అంశంపై పార్టీ విస్తృత సమావేశంలో చర్చించామని, ఈ సమావేశంలో ఇబ్రహీం కూడా పాల్గొన్నారని అయితే ఇప్పుడు మాట మారుస్తున్నారని పార్టీ అధికార ప్రతినిధి ఎమ్మెల్సీ టీఏ శరవణ పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలో మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇబ్రహీం వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు
- కుమారస్వామి
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ సమ్మతితో విస్తృ త సమాలోచనల అనంతరమే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్న తీర్మానం చేశామని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి పేర్కొన్నారు.
బెంగళూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమదే అసలైన జేడీఎస్ అంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. కావాలంటే తామే ఒరిజినల్ అంటూ మెడలో బోర్డు తగిలించుకోవాలని ఇబ్రహీంకు చురకలంటించారు. ఇబ్రహీం వ్యాఖ్యలను సీరియ్‌సగా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఆయన లేవనెత్తిన అంశాలకు తాను బదులివ్వబోనన్నారు. కాగా అంతకుముందు ఇబ్రహీం లెటర్‌హెడ్‌పై మీడియా కార్యాలయాలకు కుమారస్వామిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు సమాచారం అందింది. అయితే తన పేరిట లెటర్‌హెడ్‌ను, నకిలీ సంతకాన్ని వినియోగించారంటూ ఇబ్రహీం జేసీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఇబ్రహీంను తక్షణం సస్పెండ్ చేయాలని పలువురు జేడీఎస్ ఎమ్మెల్యేలు దళపతి దేవెగౌడను కోరినట్టు తెలుస్తోంది.