Chandrayaan-3: ఆ 17 నిమిషాలే అత్యంత కీలకం.. ల్యాండింగ్ ప్రక్రియ ఎలా సాగుతుందంటే?
ABN , First Publish Date - 2023-08-23T17:41:50+05:30 IST
మరికొద్దిసేపట్లో చంద్రయాన్-3 చంద్రుడిపై అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. రోదసిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 లక్ష్యం దిశగా చివరి అంకానికి చేరుకుంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో...
మరికొద్దిసేపట్లో చంద్రయాన్-3 చంద్రుడిపై అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. రోదసిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 లక్ష్యం దిశగా చివరి అంకానికి చేరుకుంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ చంద్రుడికి మరింత చేరువకి చేరింది. ఈ నేపథ్యంలోనే.. ఈ ప్రయోగం విజయవంతం అవ్వాలని భారతీయులందరూ కోరుకుంటున్నారు. చంద్రయాన్-2 లాగా ఇది క్రాష్ అవ్వకుండా.. సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వాలని హిందువులు, ముస్లిములు, క్రిస్టియన్లు ప్రార్థిస్తున్నారు.
అయితే.. ఈ చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే క్రమంలో చివరి 17 నిమిషాలు ఎంతో కీలకమైనవని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ప్రక్రియను ఇస్రో అధికారులు ‘17 నిమిషాల టెర్రర్’గా పేర్కొంటున్నారు. ఎందుకంటే.. ఈ ప్రక్రియ పూర్తిగా స్వతంత్రమైనది. అంటే.. ల్యాండింగ్ ప్రక్రియ మొత్తం స్వయంగా ల్యాండర్ చూసుకోవాల్సి ఉంటుంది. సమయానికి అనుగుణంగా ల్యాండర్ సరిపడా ఇంధనాన్ని వినియోగించుకొని.. సురక్షితమైన ప్రాంతాన్ని స్కాన్ చేసి, అక్కడ ల్యాండింగ్ చేయాల్సి ఉంటుంది.
అసలు ఈ ల్యాండింగ్ ప్రక్రియ ఎలా సాగుతుందంటే..
* చంద్రుడి ఉపరితలానికి 30 కి.మీల ఎత్తులో ఉన్నప్పుడు.. ల్యాండర్ పవర్ బ్రేకింగ్ దశలోకి అడుగుపెడుతుంది.
* చంద్రుడి ఉపరితలానికి చేరువ అయ్యేందుకు.. ల్యాండర్ తన నాలుగు ఇంజిన్లను మండించుకుంటుంది. అనంతరం చంద్రుడి గురుత్వాకర్షణకు అనుగుణంగా తన వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటుంది.
* చంద్రుడి ఉపరితలానికి 6.8 కి.మీల ఎత్తుకు చేరుకున్న తర్వాత.. ల్యాండర్ తన రెండు ఇంజిన్లను ఆఫ్ చేస్తుంది. మరో రెండు ఇంజిన్ల సహకారంతో వేగాన్ని తగ్గించుకుంటుంది. రివర్స్ థ్రస్ట్‌తో కిందకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది.
* ల్యాండర్ ‘ఫైన్ బ్రేకింగ్ దశ’లోకి అడుగుపెట్టినప్పుడు.. ‘చంద్రయాన్-3’ 90 డిగ్రీలు వంపు తిరుగుతుంది. అప్పుడు అది చంద్రుడి ఉపరితలంపై నిలువు స్థానానికి వస్తుంది.
* చంద్రుని ఉపరితలానికి 800 మీటర్ల ఎత్తుకు చేరుకున్నప్పుడు.. ల్యాండర్ నిలువు, అడ్డం వేగాలు సున్నాకు తగ్గిపోతాయి.
* అప్పుడు ల్యాండర్ 150 మీటర్ల ఎత్తుకు చేరుకొని.. ల్యాండింగ్ కోసం సురక్షిత ప్రాంతాన్ని అన్వేషిస్తుంది.
* పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే.. రెండు ఇంజిన్ల సహాయంతో ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెడుతుంది. అనంతరం దాన్ని రోబోటిక్ కాళ్లు సెకనుకు 3 మీటర్ల వేగంతో ఉపరితలాన్ని తాకుతాయి.
* రోబోటిక్ కాళ్లకు అమర్చిన సెన్సార్లు చంద్రుడి ఉపరితలాన్ని నిర్ధారించుకున్నాక ఇంజిన్లు ఆఫ్ అవుతాయి.
* ఇలా ఈ మొత్తం ప్రక్రియ 17 నిమిషాల పాటు కొనసాగి.. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అవుతుంది.
* చివరగా ల్యాండర్ నుంచి రోవర్ కిందకు దిగి.. చంద్రుడి ఉపరితలంపై తన పరిశోధనల్ని మొదలుపెడుతుంది. ల్యాండర్, రోవర్ 14 రోజుల పాటు చంద్రుడిపై పరిశోధనలు సాగిస్తాయి.