Share News

Rajasthan Assembly Election2023: జరిగిందేదో జరిగింది...అవి ఇప్పుడొద్దు: సీఎంతో విభేదాలపై పైలట్

ABN , First Publish Date - 2023-11-14T19:53:52+05:30 IST

గెలిచే అభ్యర్థులకే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇచ్చిందని, చాలావరకూ టిక్కెట్ల పంపిణీ సజావుగా జరిగిందని రాజస్థాన్ కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ తెలిపారు. ముఖ్యమంత్రితో గత విభేదాలపైనా ఆచితూచి స్పందించారు. జరిగిందేదే జరిగిపోయిందని, ఏం చెప్పామో, ఏం మాట్లాడామో వాటిని మరిచిపోయి కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పైలట్ తెలిపారు.

Rajasthan Assembly Election2023: జరిగిందేదో జరిగింది...అవి ఇప్పుడొద్దు: సీఎంతో విభేదాలపై పైలట్

జైపూర్: గెలిచే అభ్యర్థులకే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇచ్చిందని, చాలావరకూ టిక్కెట్ల పంపిణీ సజావుగా జరిగిందని రాజస్థాన్ (Rajasthan) కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ (Sachin Pilot) తెలిపారు. ముఖ్యమంత్రితో గత విభేదాలపైనా ఆచితూచి స్పందించారు. జరిగిందేదే జరిగిపోయిందని, ఏం చెప్పామో, ఏం మాట్లాడామో వాటిని మరిచిపోయి కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పైలట్ తెలిపారు.


''ఎవరేమన్నారనేది విడిచి పెట్టండియ నేను మాట్లాడిన వాటికి నేను బాధ్యుడను. రాజకీయ చర్చల్లో గౌరవాన్ని పాటించాలి. ఎవరేమన్నారనే విషయాలపై నేను స్పందించను. జరిగినదంతా మరిచిపోయి కలిసికట్టుగా ముందుకు వెళ్లాలి. వ్యక్తులు, పదవులు, ప్రకటనల గురించి ప్రస్తావించాల్సిన సమయం కాదిది. దేశం గురించి, పార్టీ గురించి ఆలోచించాల్సిన సమయం'' అని పైలట్ తెలిపారు. ఎవరికి ఏ పదవులు వస్తాయనేది కూడా వ్యక్తులు నిర్ణయించే అంశం కాదని, మెజారిటీ సాధించిన తర్వాత ఎమ్మెల్యేలు, నాయకత్వం కలిసి దానిపై నిర్ణయం తీసుకుంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సూచన మేరకు.. 'క్షమించండి, మరిచిపోండి, ముందుకు కదలండి' అనేదే రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ మంత్రమని అన్నారు.


మాముందున్న లక్ష్యం అదే..

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గెలుపే తమ ముందు ఉన్న లక్ష్యమని పైలట్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోరాడటం, ప్రజా తీర్పును శిరసావహించడం అన్నదే కాంగ్రెస్ చిరకాల సంప్రదాయమని, ఒకసారి మెజారిటీ అంటూ వచ్చాక ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలనేది ఎమ్మెల్యేలు, ఢిల్లీ అధినాయకత్వం చూసుకుంటుందని తెలిపారు. వ్యక్తిగతంగా యువకులకు ఎన్నికల్లో పోటీకి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని తాను కోరుకుంటానని, ఈసారి చాలా మంది యువకులకు అవకాశం కల్పించారని పైలట్ చెప్పారు. ఈరోజు దేశానికి బలమైన విపక్షం అవసరమని, కాంగ్రెస్ అందుకు ప్రత్యామ్నాయమని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు సాధించనుందన్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నందున ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో 4-5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలువడం అనివార్యమని అన్నారు.


గెలుస్తాం..అంతా కలిసే ఉన్నాం: కేసీ వేణుగోపాల్

రాజస్థా్న్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుతు తథ్యమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జైపూర్‌లో మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్ (సీఎం) కలిసి కనిపించకపోవడంపై అడిగిన ప్రశ్నకు ఆయన నవ్వుతూ సమాధానమిచ్చారు. ''వేచిచూడండి. మేమంతా ఒకటే. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్, మోహన్ ప్రకాష్, సీపీ జోషి, తక్కిన అందరూ కలిసే ఉన్నారు. కలిసికట్టుగానే పోరాడుతున్నారు. మేము ఈ ఎన్నికల్లో గెలవబోతున్నాం'' అని చెప్పారు.

Updated Date - 2023-11-14T19:53:53+05:30 IST