CRPF Recruitment Test: అమిత్‌షాకు ఎంకే స్టాలిన్ లేఖ

ABN , First Publish Date - 2023-04-09T16:49:59+05:30 IST

సీఆర్‌పీఎఫ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ మరోసారి కేంద్రానికి, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య అభిప్రాయ భేదాలకు..

CRPF Recruitment Test: అమిత్‌షాకు ఎంకే స్టాలిన్ లేఖ

చెన్నై: సీఆర్‌పీఎఫ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CRPF Recuritment Test) అంశం మరోసారి కేంద్రానికి, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య అభిప్రాయ భేదాలకు తావిచ్చింది. సీఆర్‌పీఎఫ్‌లో రిక్రూట్‌మెంట్ కోసం కంప్యూటర్ టెస్టులో తమిళ భాషను చేర్చకపోవడంతో విభేదిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah)కు ఆదివారంనాడు లేఖ రాశారు. ఆంగ్లం, హిందీలో మాత్రమే పరీక్ష రాయడాన్ని తప్పనిసరి చేస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం పూర్తిగా వివక్షతో కూడుకున్న నిర్ణయమని, ఏకపక్ష నిర్ణయమని తన లేఖలో స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో 9,212 ఖాళీలను భర్తీ చేయనుండగా, ఇందులో తమిళనాడు నుంచి 579 ఖాళీలు భర్తీ చేయనున్నారు. 12 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే, ఇంగ్లీషు, హిందీలో మాత్రమే పరీక్ష రాయలంటూ కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్‌లో పేర్కొనడం వల్ల తమిళనాడు అభ్యర్థులు తమ సొంత రాష్ట్రంలోనే సొంత భాషలో పరీక్ష రాయలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆ లేఖలో స్టాలిన్ కేంద్ర హోం మంత్రికి తీసుకువచ్చారు. మొత్తం 100 మార్కుల్లో 25 మార్కులు 'బేసిక్ కాంప్రహెన్షన్ ఇన్ హిందీ'కి కేటాయించడం వల్ల హిందీ భాష మాట్లాడేవారు మాత్రమే లబ్ధి పొందుతారని స్టాలిన్ అన్నారు. ఇది తమిళనాడు నుంచి దరఖాస్తు చేసుకున్న వారి ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని అన్నారు. ఇది ఏకపక్ష నిర్ణయం మాత్రమే కాకుండా వివక్షతో కూడిన నిర్ణయమని ఆయన తప్పుపట్టారు. ఇందువల్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఆశిస్తున్న తమిళనాడు అభ్యర్థులకు ఉద్యోగాలు దొరక్కుండా పోయే అవకాశం ఉందని, అభ్యర్థుల రాజ్యాంగ హక్కులకు ప్రభుత్వ నోటిఫికేషన్ వ్యతిరేకమని అన్నారు. హిందీ మాట్లాడటం రాని అభ్యర్థులను తమిళ భాషతో సహా అన్ని ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసేందుకు వీలు కల్పించేలా తక్షణం జోక్యం చేసుకోవాలని అమిత్‌షా‌ను స్టాలిన్ ఆ లేఖలో కోరారు.

Updated Date - 2023-04-09T16:57:16+05:30 IST