మిజోరాంపై మణిపూర్ ఎఫెక్ట్!
ABN, First Publish Date - 2023-11-01T05:30:09+05:30
ఈశాన్య రాష్ట్రం మిజోరాం అసెంబ్లీ ఎన్నికల రాజకీయం హోరాహోరీగా సాగుతోంది. పొరుగున ఉన్న మణిపూర్‌లో కుకీ క్రిస్టియన్లపై జరిగిన దాడులు ఇక్కడ ప్రభావం చూపుతున్నాయి.
కుకీలపై దాడులతో రగులుతున్న మిజోలోని మెజారిటీ క్రిస్టియన్లు
ఈశాన్య రాష్ట్రం మిజోరాం అసెంబ్లీ ఎన్నికల రాజకీయం హోరాహోరీగా సాగుతోంది. పొరుగున ఉన్న మణిపూర్‌లో కుకీ క్రిస్టియన్లపై జరిగిన దాడులు ఇక్కడ ప్రభావం చూపుతున్నాయి. కుకీలపై జరిగిన దాడుల విషయంలో మిజో క్రిస్టియన్లు రగిలిపోతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ ఎంఎన్‌ఎఫ్ మిత్రపక్షం బీజేపీ అగ్రనేతలు మణిపూర్ రగడ విషయంలో వ్యవహరించిన ఉదాసీన వైఖరిపై మండిపడుతున్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు పెంచింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇప్పటికే 2 రోజులపాటు పర్యటించి పార్టీలో ఉత్సాహం నింపారు. మరోవైపు స్థానిక పార్టీ జెడ్‌పీఎం చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో ఈశాన్య రాష్ట్రంలో త్రిముఖ పోరు స్పష్టంగా కనిపిస్తోంది. మిజోరాంలో గెలిచే తీరాలన్న కసితో రాహుల్ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నాయకులను నడిపిస్తున్నారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్ మిజోరాంలో స్పష్టమైన వ్యూహంతో అడుగులు వేస్తోందన్న సంకేతాలు పంపించినట్టయింది.
బీజేపీతో థంగాకు తలనొప్పులు!
మిజోరాంలో క్రిస్టియన్ జనాభా ఎక్కువ. ప్రస్తుత సీఎం, ఎంఎన్‌ఎఫ్ చీఫ్ జోరామ్‌థంగా వారిపైనే ఆధారపడ్డారు. అయితే, మణిపూర్‌లో క్రిస్టియన్లపై దాడుల విషయంలో బీజేపీ అగ్రనాయకత్వం వ్యవహరించిన తీరును ఇక్కడి క్రిస్టియన్లు ఎండగడుతున్నారు. ఇది తన కొంపముంచుతుందని థంగా అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 87ు ఉన్న క్రిస్టియన్లు దాదాపు ఎనిమిదికి పైగా జిల్లాల్లో అధికారాన్ని శాసించే స్థాయిలో ఉన్నారు. ఎంఎన్‌ఎ్‌ఫ-బీజేపీ కూటమి పట్ల ఇక్కడి క్రిస్టియన్లు సంతృప్తిగా లేరన్న విషయాన్ని గమనించిన థంగా వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. బీజేపీతో తాను దూరం అన్నట్టుగా వ్యవహరిస్తూ.. ఐజ్వాల్‌లో కుకీ క్రిస్టియన్లకు సంఘీభావం ప్రకటించారు. అంతేకాదు, కుకీలకు ప్రత్యేక పాలన అందించాలని డిమాండ్ చేయడంతోపాటు మణిపూర్ సీఎం, బీజేపీ నేత బీరేన్ సింగ్‌పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, కుకీలు సహా శరణార్థులుగా మయన్మార్ నుంచి వచ్చిన చిన్ వర్గాలకు థంగా ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. మణిపూర్ అంశంపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి కూడా ఎంఎన్‌ఎఫ్ పార్టీ మద్దతిచ్చింది.
కాంగ్రెస్ వర్సెస్ ఎంఎన్‌ఎఫ్ వర్సెస్ జెడ్‌పీఎం
మిజోరాంలో అధికారం కోసం 1989 నుంచి కాంగ్రె్‌స-ఎంఎన్‌ఎ్‌ఫల మధ్యే రాజకీయ పోరు కొనసాగుతోంది. 1989 ఎన్నికల్లో లాల్ తన్హావాలా(80) నేతృత్వంలో కాంగ్రెస్ అధికారం దక్కించుకుని, వరుసగా 1993లోనూ నిలబెట్టుకుంది. ఇక, జోరామ్‌థంగా నేతృత్వంలోని ఎంఎన్‌ఎఫ్ 1998, 2003లో వరుస విజయాలు దక్కించుకుంది. 2008, 2013లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టగా 2018 ఎన్నికల్లో థంగా సర్కారు ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో మరోసారి విజయం దక్కించుకుని అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని సీఎం థంగా పట్టుదలతో ఉన్నారు. అయితే, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి లాల్‌దుహోమా నేతృత్వంలోని జెడ్‌పీఎం పార్టీ పట్టణాలు, నగరాల్లో దూకుడుగా ఉంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకుని ఎంఎన్‌ఎ్‌ఫకు గట్టిపోటీ ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ పోరులోనూ జెడ్‌పీఎం పార్టీ బలంగా పోరాడుతోంది..
- సెంట్రల్ డెస్క్
2018 ఎన్నికల్లో బలాబలాలు ఇవీ
మిజోరాంలోని 40 అసెంబ్లీ స్థానాలకు గాను 2018 ఎన్నికల్లో సీఎం థంగా నేతృత్వంలోని ఎంఎన్‌ఎఫ్ 26 స్థానాల్లో విజయం దక్కించుకుంది. మిత్రపక్షం బీజేపీ కేవలం ఒకే ఒక్కచోట గెలుపుగుర్రం ఎక్కింది. కాంగ్రెస్ పార్టీ 5 చోట్ల, మరో విపక్షం జోరాం పీపుల్స్ మూమెంట్(జెడ్‌పీఎం) 8 స్థానాలను కైవసం చేసుకుంది. ఇదిలావుంటే, 40 స్థానాలున్న మిజోరాం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబరు 7న జరగనుంది.
Updated Date - 2023-11-01T05:30:09+05:30 IST