AAP: సిసోడియాను 'టార్చర్' పెడుతున్న సీబీఐ: ఆప్ సంచలన ఆరోపణ
ABN, First Publish Date - 2023-03-05T18:18:02+05:30
ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ చిత్రహింసలకు గురిచేస్తోందని..
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia)ను సీబీఐ (CBI) చిత్రహింసలకు (Torturing) గురిచేస్తోందని ఆ పార్టీ జాతీయ ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ (Sourabh bhardwaj) ఆదివారంనాడు సంచలన ఆరోపణ చేశారు. తప్పుడు ఆరోపణలతో కూడిన పేపర్లపై సంతకాలు చేయాలని ఒత్తిడి చేస్తోందని తెలిపారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం (Excise policy Scam) కేసులో దర్యాప్తునకు సహకరించడం లేదనే అభియోగంతో సిసోడియాను ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేసింది. మార్చి 6వ తేదీ వరకూ సిసోడియా కస్టడీని సీబీఐ కోర్టు గత శనివారం నాడు పొడిగించింది. సోసిడియా బెయిలు అభ్యర్థనపై విచారణను కూడా కోర్టు ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది.
కాగా, సిసోడియాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేనందున ఆయనను సీబీఐ చిత్రహింసలు పెడుతోందని, తప్పుడు ఆరోపణలతో కూడిన డాక్యుమెంట్లపై సంతకాలు చేయమని ఒత్తిడి తెస్తోందని భరద్వాద్ ఆదివారంనాడు మీడియా సమావేశంలో ఆరోపించారు. సాక్ష్యాలు మాయమైనట్టు సీబీఐ చెప్పడం లేదని, సిసోడియా ఇంటిపై దాడి చేసి కూడా ఎలాంటి సాక్ష్యాలు సేకరించ లేకపోయిందని ఆయన తెలిపారు.
సిసిడోయా సైతం శనివారంనాడు తన కస్టడీ పూర్తయిన సందర్భంగా కోర్టుకు హాజరైనప్పుడు, విచారణ పేరుతో తనను ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు కూర్చోపెడుతున్నారని, అడిగిందే అడుగుతున్నారని కోర్టుకు విన్నవించారు. మానిసికంగా ఎంతో వేదనకు గురవుతున్నట్టు చెప్పారు. దీంతో న్యాయమూర్తి వెంటనే స్పందించారు. నిందితుడిపై 'థర్డ్ డిగ్రీ' ప్రయోగించవద్దని, అడిగిన ప్రశ్నే మళ్లీ అడగవద్దని, కొత్త విషయం ఏమైనా ఉంటేనే ఆయనను అడగమని సీబీఐని న్యాయమూర్తి ఆదేశించారు.
Updated Date - 2023-03-05T18:18:02+05:30 IST