Milk: 3 లక్షల లీటర్ల పాలు వృథా.. అసలు ఏం జరిగిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-03-31T10:25:28+05:30 IST

అంబత్తూరు డెయిరీ(Ambattur Dairy)లో యాంత్రిక లోపం కారణంగా గురువారం 3 లక్షల లీటర్ల ఆవిన్‌ పాలు వృథా అయ్యాయి.

Milk: 3 లక్షల లీటర్ల పాలు వృథా.. అసలు ఏం జరిగిందో తెలిస్తే..

చెన్నై, (ఆంధ్రజ్యోతి): అంబత్తూరు డెయిరీ(Ambattur Dairy)లో యాంత్రిక లోపం కారణంగా గురువారం 3 లక్షల లీటర్ల ఆవిన్‌ పాలు వృథా అయ్యాయి. దీంతో సరైన సమయంలో యంత్రాలను మరమ్మతు చేయని ఆ డెయిరీలోని ఇద్దరు ఉన్నతాధికారులను సస్పెండ్‌ చేశారు. ఆ డెయిరీకి ప్రతిరోజూ సాయంత్రానికల్లా వివిధ జిల్లాల నుంచి ట్యాంకర్‌ లారీల ద్వారా పాలను సరఫరా చేస్తుంటారు. ఆ పాలను డెయిరీలో శుద్ధీకరణ చేసి ఆవిన్‌ ప్యాకెట్లలో నింపి నగరంలోని అన్నానగర్‌, మొగప్పేర్‌, మధురవాయల్‌, నెర్‌కుండ్రం, కోయంబేడు, వడపళని, తిరువేర్కాడు, వలసరవాక్కం తదితర ప్రాంతాలకు వేకువజాము ఐదు గంటలకల్లా పాల ప్యాకెట్లను సరఫరా చేస్తుంటారు. ఏజెంట్లు ప్యాకెట్లను పొంది తమ నెలసరి కార్డుదారులకు ఉదయం ఆరుకల్లా ఇళ్ల వద్దకే వెళ్ళి పంపిణీ చేస్తారు. ఈ నేపథ్యంలో ఆ డెయిరీలో కొద్ది రోజులకు ముందు పాలపిండి మిశ్రమం తయారీకి ఉపయోగించే యంత్రాలు పనిచేయకుండా మొరాయిస్తుండడంతో పాలప్యాకెట్లను సకాలంలో సరఫరా చేయలేక తంటాలు పడ్డారు. ఈ పరిస్థితులలో గురువారం వేకువజాము ఆ పాల కర్మాగారంలో యంత్రాలు పూర్తిగా పనిచేయకుండా మొరాయించాయి. దీనితో మూడు లక్షల లీటర్ల పాలను ఆవిన్‌ పాలప్యాకెట్ల(Avin milk packets)లో నింపే పనులు ఉదయం ఆరు వరకు కొనసాగాయి. ఆ తర్వాతే పాల లారీల్లో ప్యాకెట్లను అన్నానగర్‌ పరిసర ప్రాంతాలకు పంపిణీ చేశారు. అయితే అప్పటికే ఆయా ప్రాంతాల్లో పాలప్యాకెట్లను తీసుకునే ఏజెంట్లు వేకువజాము నాలుగు గంటల నుంచి ఉదయం ఆరువరకూ వేచి చూసి ఇక ప్యాకెట్లు రావని ఇళ్ళకు తిరిగివెళ్ళిపోయారు. దీనితో సరఫరా కావాల్సిన మూడు లక్షల లీటర్ల పాలు వృథా అయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం ఆ డెయిరీలో పనిచేస్తున్న ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేసింది. పాలనాణ్యతను పరిశీలించే విభాగంలో సూపరింటెండెంట్‌ను సస్పెండ్‌ చేసి వేకన్సీ రిజర్వులో ఉంచింది. ఈ ఘటనపై ఉన్నతాస్థాయి అధికారులతో విచారణ జరుపనున్నట్లు ఆవిన్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుబ్బయ్య తెలిపారు.

Updated Date - 2023-03-31T10:25:28+05:30 IST