Natasha : ప్రపంచంలో అత్యంత తెలివైన విద్యార్థిని నటాషా
ABN , First Publish Date - 2023-02-08T04:45:22+05:30 IST
పిట్ట కొంచెం.. కూత ఘనం అంటే ఇదేనేమో. ఈ చిన్నారి తాను చదివే తరగతి కంటే పై గ్రేడ్ స్థాయి ప్రశ్నలకు సైతం ఇట్టే సమాధానాలు చెప్పేస్తుంది.
ఇండో-అమెరికన్ చిన్నారి అసాధారణ ప్రతిభ
వాషింగ్టన్, ఫిబ్రవరి 7: పిట్ట కొంచెం.. కూత ఘనం అంటే ఇదేనేమో. ఈ చిన్నారి తాను చదివే తరగతి కంటే పై గ్రేడ్ స్థాయి ప్రశ్నలకు సైతం ఇట్టే సమాధానాలు చెప్పేస్తుంది. వివిధ దేశాల విద్యార్థులతో పరీక్షల్లో పోటీ పడి టాప్‌లో నిలిచి అరుదైన గౌరవం సాధించింది. ప్రపంచంలోనే తెలివైన విద్యార్థినిగా ఇండో-అమెరికన్ బాలిక నటాషా పెరియనాయగమ్(13) నిలిచింది. అమెరికాలోని జాన్స్ హాప్‌కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ (సీటీవై) నిర్వహించిన పరీక్షల్లో ఆమె అసాధారణ ప్రతిభ కనబరిచింది. 76 దేశాలకు చెందిన 15,300 మంది విద్యార్థులు ప్రస్తుతం తాము చదువుతున్న తరగతి కంటే పైగ్రేడ్ స్థాయిలో 2021-22లో నిర్వహించిన పరీక్షల్లో పాల్గొన్నారు. వారిలో 27శాతం కంటే తక్కువ మంది మాత్రమే అర్హత సాధించారు. అప్పట్లో 5వ గ్రేడ్ చదువుతున్న న్యూజెర్సీకి చెందిన నటాషా ఈ పరీక్షల్లో సత్తా చాటింది. వెర్బల్, క్వాంటిటేటివ్ విభాగాల్లో 90 పర్సంటైల్ స్కోర్ చేసింది. 8వ గ్రేడ్ విద్యార్థిని స్థాయి ప్రతిభ కనబర్చడం ద్వారా టాపర్ల జాబితాలో చోటు దక్కించుకొంది. అదేవిధంగా ఈ సంవత్సరం నిర్వహించిన పరీక్షల్లోనూ ఆమె మిగిలిన అందరు విద్యార్థుల కంటే ఎక్కువ స్కోర్ చేసింది. ఎస్‌ఏటీ, ఏసీటీ పరీక్షల్లో నటాషా చక్కటి స్కోర్ చేసి ప్రథమ స్థానంలో నిలిచిందని సీటీవై టాలెంట్ సెర్చ్ విభాగం సోమవారం ప్రకటించింది.