National leaders: సీఎంగారూ.. జాతీయ రాజకీయాల్లోకి రండి
ABN, First Publish Date - 2023-03-02T08:54:19+05:30
ప్రజాసామ్య పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) జాతీయ రాజకీయాలకు నేతృత్వం వహించాలని పలువురు జాతీయ నేతలు
చెన్నై, (ఆంధ్రజ్యోతి): ప్రజాసామ్య పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) జాతీయ రాజకీయాలకు నేతృత్వం వహించాలని పలువురు జాతీయ నేతలు విజ్ఞప్తి చేశారు. స్థానిక నందనం వైఎంసీఏ మైదానంలో బుధవారం సాయంత్రం జరిగిన డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 70వ జన్మదిన వేడుకల సభకు హాజరైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫారూఖ్ అబ్దుల్లా, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav), బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మాట్లాడుతూ... స్టాలిన్ పాలనాదక్షతను, పార్టీని ఆయన నడుపుతున్న తీరును కొనియాడారు. ఈ సందర్భంగా ఎవరేమన్నారంటే..?!
సెక్యులరిజం పరిరక్షణే మన ధ్యేయం
- మల్లికార్జున ఖర్గే
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తూ... రాబోవు లోక్‌సభ ఎన్నికల్లో సెక్యులరిజం పరిరక్షణే ధ్యేయంగా ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ పాలనలో దేశం దయనీయ స్థితికి చేరిందని, 23 కోట్లమంది యువకులు నిరుద్యోగంతో అలమటిస్తున్నారన్నారు. రాజ్యాంగ ధర్మాసనంలోని న్యాయవ్యవస్థ సహా అన్ని వ్యవస్థల్లోనూ బీజేపీ ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తూ ఆ సంస్థల పరువు ప్రతిష్టలను మంటగలుపుతోందని ధ్వజమెత్తారు. తమిళనాట రాజగోపాలాచారి, సత్యమూర్తి, కామరాజర్, పెరియార్, సి.సుబ్రమణ్యం, ఆర్.వెంకట్రామన్, అన్నాదురై, కరుణానిధి వంటి నాయకులను దేశ ప్రజలు మరువలేరని, వారి అడుగుజాడల్లో స్టాలిన్ పయనిస్తూ రాష్ట్ర ప్రజలకు చక్కటి పాలనను అందిస్తున్నారని చెప్పారు. తమిళనాట సామాజిక న్యాయానికే అగ్రతాంబూలం ఇచ్చి నిర్బంధ విద్యను ప్రోత్సహిస్తున్నారని, ఉపాధి కోసం కొత్త పరిశ్రమలను నెలకొల్పుతున్నారని పేర్కొన్నారు. డీఎంకేతో కాంగ్రెస్ పొత్తు పదిలమని, లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య బంధం మరింత పటిష్ఠమవుతుందన్నారు. బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు బీజేపీ అధికార ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారని, బీజేపీ గవర్నర్ తీరు కూడా అలాగే వుందన్నారు. బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో బీజేపీ కుతంత్రాలకు పాల్పడి ప్రభుత్వాలను కూలగొడుతోందన్నారు. అయితే తమిళనాట మాత్రం ఆ పార్టీ పప్పులుడకలేదని, తమిళ ప్రజలు మతతత్త్వపార్టీకి వ్యతిరేకులని నిరూపించగలిగారని కొనియాడారు. దేశాన్ని దుష్టశక్తుల నుండి కాపాడాలంటే కాబోయే ప్రధాని ఎవరనే అంశాన్ని పక్కనబెట్టి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలన్నారు. దేశ రక్షణకు అందరూ పాటుపడాలని, ఆ దిశగా స్టాలిన్ గట్టిమద్దతు ఇవ్వాలని కోరారు. దేశంలో సెక్యులరిజం, భావస్వేచ్ఛను కాపాడేందుకు అందరం ఏకమవుదామని అన్నారు.
కలిసి నడుద్దాం: ఫారూఖ్ అబ్దుల్లా
దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రధాన ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా పోరాడాల్సిన తరుణం ఆసన్నమైందని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫారూఖ్ అబ్దుల్లా పిలుపునిచ్చారు. సభలో ఆయన ప్రసంగిస్తూ.. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యానికే గాక రాజ్యాంగ ధర్మాసనానికి సైతం పెనుముప్పు రాబోతోందని హెచ్చరించారు. జమ్మూ కశ్మీర్ రాష్ర్టానికి, తమిళనాడు రాష్ట్రానికి అవినాభావ సంబంధాలున్నాయని, ప్రజాస్వామ్యానికి ముప్పువాటిల్లినా, దేశానికి ముప్పువాటిల్లినా రెండు రాష్ట్రాలు దేశాన్ని కాపాడేందుకు నడుంబిగిస్తాయన్నారు. స్టాలిన్ తండ్రి కరుణానిధికి తన తండ్రి షేక్ అబ్దుల్లాకు సన్నిహిత సంబంధాలుండేవని, అదే రీతిలో స్టాలిన్ తనతో సంబంధాలను కొనసాగిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. తమిళ రాష్ట్రానికి చెందిన అన్నాదురై, కామరాజర్, కరుణానిధి లాంటి నేతలు దేశ సమైక్యత కోసమే పోరాడారని చెప్పారు. దేశంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు వంటి ఎన్ని మతాలున్నా మనమందరం భారతీయులమనే ఏకభావనను కలిగి ఉండాలని, అయితే ప్రస్తుతం ఈ భావనకు కేంద్రంలోని పాలకులు గండికొడుతున్నారని మండిపడ్డారు. దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీ పాలకులను ఓడించడానికి కలిసి కట్టుగా పోరాడాలన్నారు. తండ్రి కరుణానిధిలాగే స్టాలిన్ కూడా జాతీయ రాజకీయాలకు నేతృత్వం వహించాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు ప్రధాని ఎవరనే వివాదాన్ని పక్కనబెట్టి భావసారూప్యత కలిగిన ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని అబ్దుల్లా విజ్ఞప్తి చేశారు.
తండ్రి బాటలోనే స్టాలిన్: అఖిలేష్ యాదవ్
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రసంగిస్తూ... దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి బాటలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ పయనిస్తూ రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతున్నారని ప్రశంసించారు. పద్నాలుగేళ్ల వయస్సులో పార్టీలో యువజన శాఖను ప్రారంభించి, అంచెలంచెలుగా పార్టీలో ఉన్నతపదవులు పొందారన్నారు. రాష్ట్రంలో చక్కటి పాలనను అందిస్తున్న స్టాలిన్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న స్టాలిన్ సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలకు సేవలందించాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రతిపక్షాలకు ఇదే మంచి తరుణం: తేజస్విని
బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ప్రసంగిస్తూ.. దేశంలో భావసారూప్యత కలిగిన ప్రతిపక్ష పార్టీలన్నీ సమైక్యంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ఇదే మంచి తరుణమని అన్నారు. బిహార్ శాసనసభలో పాల్గొనటం వల్ల తాను ఈ సభకు ఆలస్యంగా వచ్చానని, అందుకు క్షమాపణలు చెప్పుకుంటున్నానని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. బిహార్ ప్రజలు తమిళ రాజకీయ నేతలపై ప్రత్యేకించి డీఎంకే నేతలపై ప్రత్యేక ఆదరాభిమానాలు ప్రదర్శిస్తుంటారని చెప్పారు. డీఎంకే లాగే తమ పార్టీ కూడా మతతత్త్వపార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతోందన్నారు. ఉత్తరాది రాష్ట్రాలు కూడా సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నాయన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించడానికి స్టాలిన్ తనకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ప్రత్యామ్నాయ మార్గాన్ని రూపొందించాలని కోరారు. తన తండ్రి చెప్పినట్లే దేశంలో ప్రస్తుతం అప్రకటిత అత్యవసర పరిస్థితి అమలులో ఉందన్నారు.
Updated Date - 2023-03-02T08:54:19+05:30 IST