Share News

Assembly polls 2023: మోదీ, అదానీలను 'పిక్‌పాకెట్‌'తో పోల్చిన రాహుల్

ABN , First Publish Date - 2023-11-22T20:04:04+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, వ్యాపారవేత్త గౌతమ్ అదానీలను 'పిక్‌ పాకెట్' తో పోలుస్తూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారంనాడు భరత్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు.

Assembly polls 2023: మోదీ, అదానీలను 'పిక్‌పాకెట్‌'తో పోల్చిన రాహుల్

భరత్‌పూర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, వ్యాపారవేత్త గౌతమ్ అదానీలను 'పిక్‌ పాకెట్' (Pick pocket)తో పోలుస్తూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారంనాడు భరత్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ, జేబులు కత్తిరించే వాడు (pick pocket) ఒంటరిగా రాడని, ముగ్గురు వ్యక్తులు ఉంటారని, ఒకరు ముందు నుంచి వస్తారని, మరొకరు వెనక నుంచి వస్తారని, ఇంకొకరు దూరం నుంచి వస్తారని చెప్పారు.


''ప్రధానమంత్రి పని మీ (ప్రజల) దృష్టిని మళ్ళించడం. ఆయన టీవీ ద్వారా ముందు వైపు నుంచి వస్తారు. హిందూ-ముస్లిం, డీమోనిటైజేషన్, జీఎస్‌టీ అంటూ ప్రజల దృష్టి మళ్లిస్తారు. అప్పుడు అదానీ వెనుక వైపు నుంచి వచ్చి బ్లేడ్ ఉపయోగించి ఆ డబ్బులు తీసుకుపోతారు. మూడో వ్యక్తి అమిత్‌షా ఆ ఇద్దరికి ఏదైనా ప్రమాదం ఉంటే హెచ్చరించడానికి ప్రజలను గమినిస్తుంటారు. ఎవరైనా ఆ ఇద్దరి మధ్యకు వస్తే వారిని ఆయన కర్రలతో చితగ్గొడతారు'' అని రాహుల్ విశ్లేషించారు.


కాగా, రాజస్థాన్ ఎన్నికల వేళ ప్రధానిపై రాహుల్ ఇటీవల సైతం ఘాటు విమర్శ చేశారు. వరల్డ్ కప్‌ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాపై భారత్ ఓటమిని విశ్లేషిస్తూ, భారత్‌ను ఓడిపోయేలా చేసింది పనౌటీ (చెడు శకునం) అని పరోక్షంగా మోదీని విమర్శించారు. మన కుర్రాళ్లు ప్రపంచకప్‌ను గెలిచేందుకు బాగానే ఉన్నారని, కానీ పనౌటీ వారిని ఓడిపోయేలే చేసిందని, ఆ విషయం దేశ ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ఈనెల 25 రాజస్థాన్ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2023-11-22T20:04:23+05:30 IST