Rajasthan Assembly polls 2023: ఇంటి నుంచే ఓటు వేసిన 12,000 మంది వృద్ధులు, దివ్యాంగులు
ABN , First Publish Date - 2023-11-15T11:14:26+05:30 IST
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో వృద్ధులు వికలాంగుల కోసం ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన తొలి విడత పోలింగ్‌లో 12,000 మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో (Rajasthan Assembly polls) వృద్ధులు (elderly people), వికలాంగుల (Disabled voters) కోసం ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునేందుకు (Home voting) ఎన్నికల కమిషన్ (Election commission) ఏర్పాటు చేసిన తొలి విడత పోలింగ్‌లో 12,000 మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 80 ఏళ్లకు పైబడిన వృద్ధులు, వికలాంగుల కోసం ఈసీ ఈ సౌకర్యం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేక పోలింగ్ బృందాలను ఈసీ నేరుగా ఇళ్లకే పంపి పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించింది. ఇంటి నుంచే ఓటింగ్‌కు రాష్ట్రవ్యాప్తంగా 62,927 మంది దరఖాస్తు చేసుకున్నట్టు ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్ గుప్తా తెలిపారు. వీరికోసం మంగళవారం తొలివిడత పోలింగ్ ప్రారంభం కాగా, 9,687 మంది వృద్ధులు, 2,655 మంది దివ్యాంగులు ఓటు వేశారు.
నవంబర్ 19 వరకూ కొనసాగింపు..
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటివద్దే ఓటు వేసే సౌకర్యం నవంబర్ 19వ తేదీ వరకూ కొనసాగిస్తున్నట్టు గుప్తా తెలిపారు. తొలి విడత పోలింగ్ సమయంలో ఇంటి వద్ద లేని వారికి రెండోసారి అవకాశం కల్పి్స్తామని చెప్పారు. నవంబర్ 20, 21 తేదీల్లో రెండోసారి పోలింగ్ బృందాలు వారి ఇళ్లకు వెళ్తాయని తెలిపారు. అత్యవసర సర్వీసుల విభాగంలో ఉండే వారు 19 నుంచి 21వ తేదీ వరకూ ఈ అవకాశం వినియోగించుకోవచ్చు. కాగా, 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీకి నవంబర్ 25న ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి.