Share News

Rajasthan Assembly polls: మధ్యాహ్నానికి 40 శాతం దాటిన పోలింగ్: ఈసీ

ABN , First Publish Date - 2023-11-25T14:49:18+05:30 IST

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చురుకుగా జరుగుతోంది. 199 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. మధ్యాహ్నం 1.30 గంటల సమయానికి 40.27 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది.

Rajasthan Assembly polls: మధ్యాహ్నానికి 40 శాతం దాటిన పోలింగ్: ఈసీ

జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Rajasthan Assembly polls) చురుకుగా జరుగుతోంది. 199 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. మధ్యాహ్నం 1.30 గంటల సమయానికి 40.27 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమిషన్ (Election commission) తెలిపింది. కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనర్ ఇటీవల కన్నుమూయడంతో కరణ్‌పూర్ నియోజకవర్గంలో పోలింగ్ వాయిదా పడింది.


అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సజావుగా సాగేందుకు ఎన్నికల కమిషన్ తగినన్ని భద్రతా ఏర్పాట్లు చేసింది. 1,02,290 మంది భద్రతా సిబ్బందిని మోహరించింది. 69,114 మంది పోలీసు సిబ్బంది, 32,876 మంది రాజస్థా్న్ హోమ్‌గార్డులు, ఆర్ఎసీ సిబ్బంది, 700 కంపెనీల సీఏపీఎఫ్ విధుల్లో ఉన్నారు.


బీజేపీ, కాంగ్రెస్ సహా ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల బరిలో పోటీపడుతున్నాయి. రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పట్టుదలగా ప్రచారం సాగించగా, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి గౌరవ్ వల్లభ్, కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్, విశ్వనాథ్ మోవార్, రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి, రాజసథాన్ విపక్ష నేత రాజేంద్ర రాథోడ్ తదితరులు ఎన్నికల బరిలో పోటీపడుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నచ్చచెప్పడంతో టిక్కెట్లు లభించని పలువురు నేతలు తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. అయినప్పటికీ ఇరు పార్టీలకు చెందిన 45 మంది తిరుగుబాటు అభ్యర్థులు రంగంలో ఉన్నారు. వీరిలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.


2018లో...

కాంగ్రెస్ పార్టీ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 99 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 73 సీట్లకు పరిమితమైంది. బీఎస్‌పీ ఎమ్మెల్యేలు, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-11-25T14:49:19+05:30 IST