RSS: రేపటి ఆర్‌ఎస్ఎస్‌ ర్యాలీకి అనుమతి. కానీ..

ABN , First Publish Date - 2023-04-14T08:47:23+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో ఆర్‌ఎస్ఎస్‌(RSS) ర్యాలీ నిర్వహించేందుకు రాష్ట్ర పోలీసు శాఖ

RSS: రేపటి ఆర్‌ఎస్ఎస్‌ ర్యాలీకి అనుమతి.  కానీ..

పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో ఆర్‌ఎస్ఎస్‌(RSS) ర్యాలీ నిర్వహించేందుకు రాష్ట్ర పోలీసు శాఖ అనుమతి జారీ చేసింది. ఈ నెల 15న ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆర్‌ఎస్ఎస్‌ నిర్వాహకులు ప్రకటించారు. ఈ ర్యాలీ సందర్భంగా అన్ని జిల్లాలలోనూ గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని డీజీపీ శైలేంద్రబాబు(DGP Shailendra Babu) డీఎస్పీలు, ప్రాంతీయ డీఐజీలకు ఆదేశాలు జారీ చేశారు. గతేడాది గాంధీ జయంతి రోజు ఆర్‌ఎ్‌సఎస్‌ నిర్వాహకులు ర్యాలీ నిర్వహించేందుకు పోలీసుల అనుమతి కోరారు. శాంతి భద్రతల సమస్యలు ఏర్పడతాయంటూ పోలీసు శాఖ ర్యాలీకి అనుమతివ్వలేదు. దీనితో ఆర్‌ఎస్ఎస్‌ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. కొన్ని షరతుల నడుమ బహిరంగ ప్రదేశాలలో, జనం అధికంగా గుమికూడే ప్రాంతాల్లో కాకుండా క్రీడా మైదానాలలో ర్యాలీలు జరుపుకునేందుకు హైకోర్టు ఉత్తర్వు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీలు పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఆర్‌ఎ్‌సఎస్‌ ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి జారీ చేసి, రాష్ట్ర ప్రభుత్వ అప్పీలును తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో ర్యాలీలు జరుపుకునేందుకు పోలీసులు గురువారం ఉదయం ఆర్‌ఎస్ఎస్‌ నిర్వాహకులకు అనుమతి జారీ చేశారు. గతంలో హైకోర్టు(High Court) ఉత్తర్వు మేరకు ఆర్‌ఎస్ఎస్‌ ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించినప్పుడు డీపీఐ జోక్యం చేసుకుని తమ పార్టీ ఆధ్వర్యంలో అదే రోజున సమైక్యతా ర్యాలీ జరుపుతామంటూ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్‌ఎస్ఎస్‌ ర్యాలీకి వ్యతిరేకంగా ఇతర పార్టీలేవైనా పోటీ ర్యాలీలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాయా అని ఇంటెలిజెన్స్‌ విభాగం పోలీసులు ఆరా తీస్తున్నారు. అదే సమయంలో ఆదివారం ఆర్‌ఎస్ఎస్‌ ర్యాలీలు జరిగే జిల్లా కేంద్రాలలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని, హింసాత్మక సంఘటనలు జరుగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలంటూ డీజేపీ శైలేంద్రబాబు డీఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2023-04-14T08:52:30+05:30 IST