Sisodia: తీహార్ జైలులో మొదటిరోజు సిసోడియా ఎలా గడిపారంటే..?
ABN , First Publish Date - 2023-03-07T14:20:03+05:30 IST
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించడంతో తీహార్ జైలుకు వెళ్లిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి..
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు(Delhi Excise policy Case)లో జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించడంతో తీహార్ జైలుకు వెళ్లిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia)కు జైలులో సీనియర్ సిటిజెన్స్ (Senior Citizens)సెల్ కేటాయించారు. ప్రస్తుతం ఆయన ఒక్కరే అందులో అంటున్నారు. ఈనెల 20వ తేదీ వరకూ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీలో ఉండనున్నారు.
సిసోడియాను తీహార్ జైల్ నెంబర్-1లోని వార్డ్ నెంబర్-9లో ఉంచామని, సీసీటీవీ పర్యవేక్షణలో ఈ సెల్ ఉందని జైలు అధికారులు తెలిపారు. సమీప భవిష్యత్తులో మరొకరితో ఆయన సెల్ పంచుకోవాల్సి ఉంటుందని చెప్పారు. కాగా, సిసోడియా ఉంటున్న వార్డులోని వేరే గదుల్లో కొందరు కరడుగట్టిన నేరస్థులు కూడా ఉన్నారు. వైద్య పరీక్షల అనంతరం సోమవారం మధ్యాహ్నం సిసోడియాను తీహార్ జైలుకు తరలించారు. ఆయన ఆరోగ్యం నార్మల్‌గానే ఉన్నట్టు వైద్య పరీక్షల్లో తేలింది. సిసిడియాతో పాటు చిన్న కిట్‌కు జైలు అధికారులు అనుమతించారు. అందులో టూత్‌పేస్ట్, టూత్ బ్రష్, సబ్బు, ఇతర నిత్యావాసర వస్తువులు ఉన్నాయి. రాత్రి డిన్నర్ టైమ్‌లో సుమారు 6-7.30 గంటలకు చపాతీ, రైస్, ఆలూ కర్రీ ఆయనకు ఇచ్చారు. విచారణ ఖైదీగా ఉన్న సిసోడియాను జైలు నిబంధనలకు అనుగుణంగా సదుపాయంగా ఉండే డ్రస్ వేసుకునేందుకు అనుమతించారు. జైలు నుంచి అదనపు దుస్తుల సదుపాయం కూడా ఉంది. బట్టలు, ఇతర సామగ్రి అందజేసేందుకు ఆయన కుటుంబ సభ్యులు మంగళవారం జైలుకు వచ్చే అవకాశం కూడా ఉంది.
జైలులోనే ప్రశ్నించనున్న ఈడీ
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జైలులోనే సిసోడియాను మంగళవారం ప్రశ్నించనుంది. సీబీఐ కస్టడీ సోమవారంనాడు ముగియడం, కస్టడీ కొనసాగింపును సీబీఐ కోరకపోవడంతో సిసోడియాను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు పంపింది. జ్యుడిషియల్ కస్టడీలో సిసోడియా తనతో పాటు మందులు, కళ్లజోడు, డైరీ, పెన్ను, భగవద్గీత పుస్తకం తీసుకువెళ్లేందుకు కోర్టు అనుమతించింది. మెడిటేషన్ సెల్ ఇవ్వాలని సిసోడియా కోరడంతో ఈ విషయాన్ని పరిశీలించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. కాగా, బెయిల్ కోరుతూ సిసోడియా దాఖలు చేసిన పిటిషన్‌పై మార్చి 10న విచారణ జరుగనుంది. ఒకవేళ కోర్టు బెయిలు ఇవ్వడానికి నిరాకరిస్తే ఆయన జ్యుడిషియల్ కస్టడీని పొడిగించే అవకాశం ఉంటుంది.