Sisodia: భద్రతకు ఢోకా లేదు.. ప్రత్యేక వార్డులోనే..!

ABN , First Publish Date - 2023-03-08T18:03:15+05:30 IST

తీహారు జైలు సెల్‌లో కరడుకట్టిన నేరస్థులతో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ను ఉంచినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఆరోపణలను..

Sisodia: భద్రతకు ఢోకా లేదు.. ప్రత్యేక వార్డులోనే..!

న్యూఢిల్లీ: తీహారు జైలు సెల్‌లో కరడుకట్టిన నేరస్థులతో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia)ను ఉంచినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చేసిన ఆరోపణలను జైలు అధికారులు ఖండించారు. సిసోడియా భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకమైన వార్డు ఆయనకు కేటాయించినట్టు తెలిపారు. సీజే-1 వార్డులో సిసోడియా ఉంటున్నారని, ఇది తక్కువ మంది ఖైదీలున్న వార్డు అని చెప్పారు. ఇందులో ఉంటున్న వారు గ్యాంగ్‌స్టర్లు కాదనీ, పైగా జైలులో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలని వివరణ ఇచ్చారు.

''సిసోడియాకు ప్రత్యేక సెల్ ఇచ్చాం. అందులో ఆయన నిరాఘాటంగా ధ్యానం, ఇతర కార్యక్రమాలు చేసుకోవచ్చు. జైలు నిబంధనల ప్రకారం, ఆయన భద్రతకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేశాం. ఆయనను ఉంచిన చోటుపై ఎవరికీ ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు'' అని జైలు అధికారులు తెలిపారు.

దీనికి ముందు, తీహార్ జైలులో కరడుకట్టిన నేరస్థులు ఉన్న చోట సిసోడియాను ఉంచారంటూ ఆప్ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందంటూ భయాందోళనలు వ్యక్తం చేశారు. ఆప్‌తో ప్రధానమంత్రికి నరేంద్ర మోదీకి వైరం ఉందని, ఆ కారణంగానే సోసిడియాకు 'విపాసన' సెల్ నిరాకరించారని, కరడుగట్టిన నేరస్థుల మధ్య ఆయనను ఉంచారని అన్నారు. మెడిటేషన్ సెల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పాటించలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన సిసోడియాకు మార్చి 20వ తేదీ వరకూ జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఇటీవల ఆదేశాలిచ్చింది. దీంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. అయితే, బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 10న కోర్టు విచారణ జరుపనుంది. కోర్టు బెయిల్ నిరాకరించిన పక్షంలో జ్యుడిషియల్ కస్టడీలోనే సిసోడియా కొనసాగాల్సి వస్తుంది.

Updated Date - 2023-03-08T18:03:15+05:30 IST