Delhi Excise policy scam: సిసోడియాకు ఎదురుదెబ్బ

ABN , First Publish Date - 2023-02-28T17:19:34+05:30 IST

మద్యం పాలసీ కుంభకోణం కేసులో (Delhi Excise policy case) అరెస్టై సీబీఐ కస్టడీలో ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా(Manish Sisodia)కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది.

Delhi Excise policy scam: సిసోడియాకు ఎదురుదెబ్బ
Manish Sisodia

న్యూఢిల్లీ: మద్యం పాలసీ కుంభకోణం కేసులో (Delhi Excise policy case) అరెస్టై సీబీఐ కస్టడీలో ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా(Manish Sisodia)కు సుప్రీంకోర్టు(Supreme Court) లో నిరాశ ఎదురైంది. సీబీఐ అరెస్ట్ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమని, హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. అంతకు ముందు తన అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ సిసోడియా సుప్రీం తలుపు తట్టారు. సిసోడియా పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ధర్మాసనం విచారణ జరిపింది.

మరోవైపు సీబీఐ (CBI) రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) సిసోడియాకు నిన్న ఐదురోజుల రిమాండ్ విధించింది. మార్చి 4 వరకు కస్టడీకి అప్పగించింది.

ఢిల్లీ ప్రభుత్వ మద్యం విధాన రూపకల్పన, అమలులో అవకతవకల వ్యవహారంపై దర్యాప్తులో భాగంగా ఆదివారం సాయంత్రం సిసోడియాను అరెస్టు చేసింది. సోమవారం ఆయన్ను రౌజ్‌ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. దర్యాప్తు సమయంలో పొంతనలేని సమాధానాలు చెప్పారని, తమ వద్ద ఉన్న ఆధారాలకు ఆయన చెబుతున్న సమాధానాలకు సరిపోలడం లేదని సీబీఐ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మద్యం విధానం కోసం రూపొందించిన ముసాయిదా నోటీసుల్లో న్యాయ నిపుణుల అభిప్రాయాలను సిసోడియా తొలగించారని ఆరోపించారు. తమ ప్రశ్నలకు దాటవేత ధోరణిలో సమాధానాలు ఇస్తున్నారని తెలిపారు. ఈ కేసు దర్యాప్తు ముందుకెళ్లాలంటే ఆయన్ను ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని కోరారు.

సిసోడియా తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీలో మార్పులను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆమోదించారని, సీబీఐ మాత్రం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం వెంట పడుతోందని తెలిపారు. సిసోడియాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలూ లేవన్నారు. కస్టడీకి ఇవ్వాలన్న సీబీఐ అభ్యర్థనను వ్యతిరేకించారు. ‘ఆయన ఢిల్లీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి. బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి ఉంది. నిన్న (ఆదివారం) ఏం జరిగింది? ఆయన్ను ఎందుకు కస్టడీలో ఉంచాల్సి వచ్చింది? రాబోయే రోజుల్లో మళ్లీ విచారణకు ఆయన అందుబాటులో ఉండరా? ఆయన్ను ఉద్దేశపూర్వకంగానే అరెస్టు చేశారా? ఇది ఓ వ్యక్తిపై దాడి. అలాగే వ్యవస్థపై కూడా. రిమాండ్‌ సరికాదు’ అని సిసోడియా తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈ కేసులో సిసోడియా ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. అయితే ఈ కేసు విచారణ సమర్థంగా జరగాలంటే సిసోడియా కస్టడీ అవసరమని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. తన ప్రమేయం ఏమీ లేదని సిసోడియా చెబుతున్నారని.. దర్యాప్తులో మాత్రం ఆయన వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకున్నట్లు తేలిందని వెల్లడించారు. దాదాపు గంటసేపు ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ప్రత్యేక కోర్టు జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ తీర్పును రిజర్వ్‌ చేశారు. సాయంత్రం సిసోడియాకు ఐదు రోజుల పాటు రిమాండ్‌ విధిస్తున్నట్లు వెల్లడించారు. మార్చి 4 వరకు ఆయన్ను సీబీఐ కస్టడీకి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆప్‌ శ్రేణుల ఆందోళనల నేపథ్యంలో భారీ భద్రత నడుమ సిసోడియాను కోర్టుకు తీసుకెళ్లారు.

సిసోడియా అరెస్టును నిరసిస్తూ ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. సోమవారాన్ని బ్లాక్‌ డేగా పేర్కొన్నారు. బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు ఆందోళన చేపట్టారు. ఢిల్లీ సహా పంజాబ్‌, ఒడిసా, జమ్మూకశ్మీర్‌ తదితర రాష్ట్రాలు, కొన్ని ఇతర నగరాల్లోనూ ఆప్‌ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్‌లోనూ ఆప్‌ నాయకులు బీజేపీ కార్యాలయ ముట్టడికి యత్నించారు.

సిసోడియా అరెస్టును ఖండిస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఉద్దేశపూర్వకంగానే ఆయన్ను సీబీఐ ద్వారా అరెస్టు చేయించిందన్నారు. ఈ చర్య ప్రధాని మోదీకి, అదానీకి మధ్య ఉన్న సంబంధం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేసిందే తప్ప మరొకటి కాదన్నారు. ఢిల్లీ మద్యం కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌ స్పందించడం ఇదే తొలిసారి.

Updated Date - 2023-02-28T18:34:06+05:30 IST