Stalin Vs RN Ravi: గవర్నర్‌కు వ్యతిరేకంగా స్టాలిన్ మరో తీర్మానం
ABN, First Publish Date - 2023-04-10T18:07:51+05:30
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి కి వ్యతిరేకంగా ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం..
చెన్నై: తమిళనాడు గవర్నర్ (Governor) ఆర్ఎన్ రవి (RN Ravi)కి వ్యతిరేకంగా ఎంకే స్టాలిన్ (MK Stalin) నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం మరో తీర్మానం చేసింది. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు గవర్నర్ క్లియరెన్స్ ఇవ్వడం లేదని, ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆ తీర్మానంలో ఆరోపించింది. దీనిపై రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ, గవర్నర్‌పై తమ ప్రభుత్వం చేసిన రెండో తీర్మానం ఇదని అన్నారు.
''గవర్నర్ నిర్లిప్త వ్యక్తిగా ఉండాలని సర్కారియా కమిషన్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారంలో జోక్యం చేసుకోరాదని డాక్టర్ అంబేడ్కర్ స్పష్టంగా చెప్పారు. గవర్నర్ మార్గదర్శిగా ఉండాలని సుప్రీంకోర్టు సైతం పలు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే మన గవర్నర్ మాత్రం ప్రజలకు మిత్రుడిగా ఉండడానికి సిద్ధంగా లేరు'' అని స్టాలిన్ అన్నారు. బిల్లును బహిరంగ వేదకపై గవర్నర్ విమర్శించడం, తప్పుడు సమాచారం ఇవ్వడం మంచిది కాదన్నారు. గవర్నర్ చర్యలను మాత్రమే తాము విమర్శిస్తున్నామని, అసెంబ్లీ కార్యక్రమాలకు ఆటంకం కలిగించేలా ఉండే మాత్రం చూస్తూ ఊరుకోమని అన్నారు.
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు నిర్దిష్ట కాలపరిమితి లోపు ఆమోదం తెలిపేలా తమిళనాడు గవర్నర్‌ను ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరుతూ చేసిన తీర్మానాన్ని తమిళనాడు మంత్రి దురై మురుగన్ సోమవారంనాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి అనుకూలంగా డీఎంకే, దాని మిత్రపక్షాలు ఓటు వేయగా, సభలో మాట్లాడేందుకు తమకు సమయం ఇవ్వలేదని నిరసన వ్యక్తం చేస్తూ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
Updated Date - 2023-04-10T18:12:50+05:30 IST