బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎక్కడ.. ఆయనకు ఏమైంది? మోదీ పర్యటనకు ఎందుకు డుమ్మా కొట్టారు..

ABN , First Publish Date - 2023-04-09T11:34:02+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai)కి ఏమైంది? ప్రధానమంత్రి పర్యటనలో ఆయన అస్సలు క

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎక్కడ.. ఆయనకు ఏమైంది? మోదీ పర్యటనకు ఎందుకు డుమ్మా కొట్టారు..

చెన్నై, (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai)కి ఏమైంది? ప్రధానమంత్రి పర్యటనలో ఆయన అస్సలు కనిపించలేదేం?.. పార్టీ శాఖలో నెలకొన్న ఆధిపత్య పోరుతో ఆయన మోదీ పర్యటనకు దూరంగా జరిగారా?.. లేక పార్టీ అధిష్ఠానమే ఆయన్ని దూరంగా పెట్టిందా?.. ప్రస్తుతం బీజేపీతో పాటు అన్ని రాజకీయవర్గాల్లో విస్త్రతంగా జరుగుతున్న చర్చనీయాంశమిది. బీజేపీకి చెందిన ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనకు వస్తున్నారంటే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కీలకంగా వ్యవహరించడం సహజం. కానీ మోదీ పర్యటనకు అన్నామలై దూరంగా వున్నారు. శనివారం విమానాశ్రయం చేరుకున్న ప్రధానికి స్వాగతం చెప్పిన వారిలో ఆయన కనిపించలేదు. ఆ తరువాతి కార్యక్రమాల్లోనూ ఆయన జాడ లేకుండాపోయారు. అన్నాడీఎంకేతో పొత్తు వ్యవహారంలో అన్నామలై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, ఆ తరువాత వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు వుంటే తాను తన పదవికి రాజీనామా చేస్తానంటూ ఇటీవల అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీలోనే తీవ్రమైన వ్యతిరేకత వెల్లువెత్తింది. దీనికి తోడు అన్నాడీఎంకే(AIADMK) నేతలు ఏకంగా బీజేపీ అధిష్ఠానానికే ఫిర్యాదు చేశారు. అటు నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో తెలియదు గానీ, అన్నామలై తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తన ఉద్దేశం.. రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసే స్థాయికి బీజేపీ ఎదగాలన్నదేనని, అంతకుమించి మరేమీ లేదని వ్యాఖ్యానించారు.

అయితే అప్పటికే ఆయనకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆది నుంచి నియంతృత్వ పోకడల్ని అనుసరిస్తున్న అన్నామలై(Annamalai)పై పలువురు సీనియర్లు సైతం బీజేపీ అగ్రనేతలకు ఫిర్యాదు చేశారు. దీనికి తోడు ఇటీవల కేంద్ర మంత్రి ఎల్‌.మురుగన్‌ మాట్లాడుతూ.. తాము 9 లోక్‌సభ స్థానాలపై గురి పెట్టామని, వాటిలో విజయమే లక్ష్యంగా పని చేస్తున్నామని ప్రకటించారు. ఆ తరువాత అన్నామలై మాట్లాడుతూ.. తమ లక్ష్యం 9 కాదని, 25 స్థానాలని వ్యాఖ్యానించారు. దీంతో మురుగన్‌-అన్నామలై మధ్య ఆదిపత్య పోరు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానికి అత్యంత ఇష్టమైన నేతల్లో ఒకరిగా పేరుగాంచిన మురుగన్‌కు విరుద్ధంగా అన్నామలై వ్యవహరించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో శనివారం ప్రధాని పర్యటనకు అన్నామలై దూరంగా వుండడంతో ఆయన్ని అధిష్ఠానమే దూరంగా వుంచినట్లు సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. అయితే బీజేపీ వర్గాలు మాత్రం.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కీలక భూమిక పోషిస్తున్న అన్నామలై.. అక్కడ ప్రచారంలో బీజీగా ఉండడంతో శనివారం రాలేకపోయారని వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ‘దాల్‌ మే కుచ్‌ కాలా హై’ అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-04-09T11:34:02+05:30 IST