Covid Cases : మన దేశంలో కోవిడ్ కేసుల పెరుగుదల వెనుక...
ABN, First Publish Date - 2023-03-16T13:19:26+05:30
మన దేశంలో ఇటీవల కోవిడ్ కేసుల పెరుగుదలకు కారణం ఎక్స్‌బీబీ.1 వేరియంట్ ఎక్స్‌బీబీ.1.16 అయి ఉండవచ్చునని SARS-CoV2
పుణే : మన దేశంలో ఇటీవల కోవిడ్ కేసుల పెరుగుదలకు కారణం ఎక్స్‌బీబీ.1 వేరియంట్ యొక్క సబ్ వేరియంట్ ఎక్స్‌బీబీ.1.16 అయి ఉండవచ్చునని SARS-CoV2 వేరియంట్స్‌ను ట్రాక్ చేస్తున్న దేశ, విదేశీ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే దీని గురించి తగినంత సమాచారం అందుబాటులో లేదని మరికొందరు నిపుణులు చెప్తున్నారు.
కోవిడ్ వేరియంట్లను ట్రాక్ చేస్తున్న ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫాం ఒకటి వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ వేరియంట్ల వారసత్వ పరంపర ఎక్కువగా భారత దేశం నుంచే వచ్చింది. భారత దేశంలో 48 వారసత్వ పరంపర (Subvarients)లను గుర్తించారు. ఆ తర్వాతి స్థానాల్లో బ్రూనై (22), అమెరికా (15), సింగపూర్ (14) ఉన్నాయి. ఈ సబ్‌వేరియంట్లు భారత దేశంతో సహా నాలుగు దేశాల్లో ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎక్స్‌బీబీ.1.16 చాలా వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వేరియంట్లను ట్రాక్ చేస్తున్న నిపుణులు గుర్తించారు.
కోవ్‌స్పెక్ట్రమ్ (covSPECTRUM) వెల్లడించిన వివరాల ప్రకారం, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఎక్స్‌బీబీ.1.16 అధికంగా ఉంది. ఈ వేరియంట్ ఎక్స్‌బీబీ.1.5 నుంచి వచ్చినది కాదు. ఈ రెండూ ఎక్స్‌బీబీ నుంచి వచ్చినవే. మన దేశంలోని జీనోమ్ సీక్వెన్సింగ్ నెట్‌వర్క్ నిపుణుడు ఒకరు తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం మన దేశంలో ఎక్స్‌బీబీ.1.ఎక్స్‌బీబీ ప్రబలంగా కనిపిస్తోంది. ఇటీవల మన దేశంలో కోవిడ్ కేసుల పెరుగుదలకు కారణం ఎక్స్‌బీబీ.1.16, ఎక్స్‌బీబీ.1.5 కారణం కావచ్చు. మరికొన్ని నమూనాలను పరీక్షిస్తే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. భారత దేశం నుంచి సింగపూర్, అమెరికా, బ్రూనైలకు వెళ్ళిన ప్రయాణికుల నుంచి సేకరించిన నమూనాలలో ఎక్స్‌బీబీ.1.16 ఉంది. కాబట్టి ఈ సబ్‌వేరియంట్ భారత దేశంలో కోవిడ్ కేసుల పెరుగుదలకు కారణమవుతుండవచ్చు. భారత దేశంలోనే పుట్టి ఉండవచ్చు. వ్యాపిస్తున్న అన్ని ఇతర SARS-CoV-2 వేరియంట్లను బహుశా ఎక్స్‌బీబీ.1.16 అధిగమించవచ్చు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్ సేఫ్టీ నెట్ మెంబర్ డాక్టర్ విపిన్ ఎం వశిష్ఠ మాట్లాడుతూ, ఎక్స్‌బీబీ.1 నుంచి వచ్చిన ఎక్స్‌బీబీ.1.5 భారత దేశంలో మినహా ప్రపంచవ్యాప్తంగా ప్రబలంగా ఉందన్నారు. అయితే ఎక్స్‌బీబీ.1.16 గురించి ఆందోళన ఉందని చెప్పారు.
భారత దేశ జాతీయ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ సభ్యుడు, అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ సంజయ్ పూజారి మాట్లాడుతూ, ఒమిక్రాన్ వేరియంట్లతో పోల్చినపుడు తీవ్రమైన అస్వస్థతకు ఎక్స్‌బీబీ.1.16 కారణమవుతుందా? అనే అంశంపై సరైన సమాచారం లేదని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
Parliament : పార్లమెంటుకు రాహుల్ గాంధీ?... క్షమాపణ చెప్పబోతున్నారా?...
Nobel Peace Prize : మోదీకి నోబెల్ శాంతి బహుమతి... నోబెల్ ప్రైజ్ కమిటీ నేత సంచలన వ్యాఖ్యలు...
Updated Date - 2023-03-16T13:35:05+05:30 IST