శ్రీ నృసింహ లీల

ABN , First Publish Date - 2023-04-28T01:57:36+05:30 IST

‘ఆది పురుషుడు’ అంటే దేవాదిదేవుడైన శ్రీమహావిష్ణువు. ఆయనే మృగేంద్రలీలను ప్రదర్శించాడు.

శ్రీ నృసింహ లీల

మే 4న శ్రీనృసింహ జయంతి

‘ఆది పురుషుడు’ అంటే దేవాదిదేవుడైన శ్రీమహావిష్ణువు. ఆయనే మృగేంద్రలీలను ప్రదర్శించాడు. మృగాల్లో రాజు సింహం కాబట్టి... శ్రీ నరసింహుని లీలకు ‘మృగేంద్ర లీల’ అని కూడా పేరు. అత్యంత సుందరమూర్తి అయిన నారాయణుడు నర-మృగ రూపాన్ని ఎందుకు స్వీకరించాల్సి వచ్చింది? అదే భక్తుల హృదయాలను రంజిపజేసే సర్వాద్భుతమైన శ్రీ నృసింహ లీల.

పూర్వం హిరణ్యకశిపుడనే రాక్షస రాజు ఉండేవాడు. అతను అమరత్వం పొందాలనే కోరికతో... బ్రహ్మ దేవుడి సాక్షాత్కారం కోసం కఠోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై... తనే అమరుణ్ణి కాదనీ, తాను వేరొకరికి అమరత్వం ఎలా అనుగ్రహించగలనననీ, కాబట్టి ఆ వరం ఇవ్వలేననీ చెప్పాడు. అప్పుడు హిరణ్యకశిపుడు జంతువులతో కానీ, మానవులతో కానీ, లోకంలోని మరే నివాసితులతో కానీ, ఏ విధమైన అస్త్ర, శస్త్రాలతో కానీ, ఇంటి లోపల కానీ, ఇంటి వెలుపల కానీ తనకు ప్రాణహాని ఉండకూడదని కోరుకున్నాడు. ఈ విధంగా మరణాన్ని పొందే అవకాశం ఉన్న సకల మార్గాలను నిరోధించే విధంగా బ్రహ్మ నుంచి వరాలను పొందగలిగాడు.

హిరణ్యకశిపుడి కుమారుడైన ప్రహ్లాదుడు... తన ఆధ్యాత్మిక గురువైన నారద మునీంద్రుడి కృపతో... తల్లి గర్భంలోనే పరమ విష్ణుభక్తిని పొందినవాడై జన్మించాడు. తను విరోధిగా భావించే విష్ణువును... తన కుమారుడు భక్తితో సేవించడాన్ని హిరణ్యకశిపుడు సహించలేకపోయాడు. ప్రహ్లాదుడు తన భక్తిని విడిచిపెట్టేలా చెయ్యడానికి పలు విధాలుగా ప్రయత్నించి విఫలమయ్యాడు. ‘‘ఎవరి శక్తి వల్ల నీలాంటి మూర్ఖుడు ఇంత మొండిగా, భయం లేకుండా నా శాసనాన్ని లెక్క చెయ్యడం లేదు?’’ అని ప్రశ్నించాడు. ‘‘ఎవరి ద్వారా మీరు మీ శక్తియుక్తులను పొందగలుగుతున్నారో... అతడే నా శక్తికీ మూలాధారం. అతడే సకలశక్తులకూ మూలాధారమైన పరంధాముడు- శ్రీహరి’’ అని వినమ్రంగా బదులిచ్చాడు ప్రహ్లాదుడు. ఆ మాటలకు మరింత ఆగ్రహించిన హిరణ్యకశిపుడు ‘‘ఎవడు వాడు? ఎక్కడున్నాడు? వాడే సమస్తంలోనూ ఉన్నట్టైతే... ఈ స్తంభంలో చూపించగలవా?’’ అని అడిగాడు. సర్వవ్యాప్తుడైన భగవంతుడు ఆ స్తంభంలో కూడా ఉన్నాడని ప్రహ్లాదుడు నిస్సంకోచంగా చెప్పాడు. వెంటనే హిరణ్యకశిపుడు సింహాసనం నుంచి లేచి, పిడికిటి పోటుతో స్తంభాన్ని పగలగొట్టాడు.

ఆ స్తంభం నుంచి... సర్వాద్భుతమైన నర మృగ శరీరంతో... నరసింహావతారుడై స్వామి అరుదెంచాడు. తన భక్తుడైన బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలను నిష్ఫలం కానివ్వకుండా... ఆ వరాలలో లేని రూపాన్ని తాను పొందాడు. తన ప్రియ భక్తుడైన ప్రహ్లాదుడి మాట నిలబెట్టడానికి స్తంభంలోంచి ఆవిర్భవించాడు. తన తెలివితేటలతో మృత్యువును జయించాలని హిరణ్యకశిపుడు భావిస్తే... అంతకుమించిన తెలివితో... తగిన రూపాన్ని ధరించి, హిరణ్యకశిపుని ఎదుట మృత్యువై నిలిచాడు. భగవంతుణ్ణి దేనిలోనూ, ఎవరూ జయించలేరు. ‘సర్వోన్నతుడు’ అనే మాటకు అర్థం అదే. ‘‘భగవంతుడు సర్వాంతర్యామి అనీ, రాజప్రాసాదంలోని స్తంభంలో సైతం భగవంతుడు ఉన్నాడనీ ప్రహ్లాదుడు అన్న మాటలను నిరూపించడానికే... దేవాదిదేవుడైన శ్రీహరి ఇదివరకు ఎన్నడూ కనీవినీ ఎరుగని సర్వాద్భుతమైన రూపాన్ని ప్రదర్శించాడు. అటు నరరూపం, ఇటు సింహరూపం కాని నరసింహ రూపంతో అవతరించాడు’’ అంటూ శ్రీనారసింహుని దివ్యావిర్భావాన్ని ‘భాగవతం’ వివరించింది.

హిరణ్యకశిపునికి పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు తనయుడిగా జన్మించడం ఆశ్చర్యం. ఇది ఆ భగవంతుడి లీల. మన జీవితం మీదా, మన కుటుంబం మీదా నియంత్రణ కలిగి ఉన్నామని అనుకుంటున్నాం. వాస్తవానికి సర్వాన్నీ నియంత్రిస్తున్నది ఆ భగవంతుడొక్కడే. ఆ కాలంలో రాక్షసులు మన లోకానికి వెలుపల నివసించేవారు. ప్రస్తుతం ప్రతి వ్యక్తిలోనూ సుర, అసుర లక్షణాలు ఉంటున్నాయి. దుష్టులైన శత్రువుల నుంచి పొంచి ఉన్న ఆపదలనుంచి సదా రక్షించాలనీ, మనలోని దుష్ట గుణాలను తొలగించి కాపాడాలనీ ఆ నరసింహుణ్ణి ప్రార్థిద్దాం.

na.jpg

శ్రీసత్యగౌర చంద్రదాస ప్రభూజీ

అధ్యక్షుడు, హరే కృష్ణ మూవ్‌మెంట్‌,

హైదరాబాద్‌, 9396956984

Updated Date - 2023-04-28T01:57:36+05:30 IST