Summer Food: కూల్ కూల్
ABN , First Publish Date - 2023-03-31T22:42:53+05:30 IST
ఎండల్లో తాపం పెరగకుండా ఉండాలంటే ఒంటిని చల్లబరిచే పదార్థాలు తింటూ ఉండాలి. లేదంటే డీహైడ్రేషన్‌కు గురైన ఎండదెబ్బకు గురవుతాం. కాబట్టి ఈ పదార్థాలను మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి!
సమ్మర్ ఫుడ్
ఎండల్లో తాపం పెరగకుండా ఉండాలంటే ఒంటిని చల్లబరిచే పదార్థాలు తింటూ ఉండాలి. లేదంటే డీహైడ్రేషన్‌కు గురైన ఎండదెబ్బకు గురవుతాం. కాబట్టి ఈ పదార్థాలను మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి!
పుచ్చకాయ: 91.45 శాతం నీరుండే పుచ్చకాయ దాహార్తిని తీర్చడంతోపాటు ఎండ వేడికి ఆవిరయ్యే శరీరంలోని ఖనిజ లవణాలనూ భర్తీ చేస్తుంది. కాబట్టి తరచుగా పుచ్చకాయ ముక్కలు తింటూ ఉండాలి.
తర్బూజా: ఒంట్లో నీటి శాతం తగ్గడం వల్ల మలబద్ధకం సమస్యకూ ఈ కాయ విరుగుడులా పని చేస్తుంది. నీటి శాతం ఎక్కువ కాబట్టి ఎండ దెబ్బ నుంచి రక్షణ కల్పిస్తుంది.
నిమ్మరసం: ఎండలో నుంచి నీడ పట్టుకు చేరగానే గ్లాసుడు నిమ్మరసం తాగితే ఎంతో ఉపశమనంగా ఉంటుంది. అయితే ఎండలోకి వెళ్లే ముందు నిమ్మరసం తాగడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే ఎండ ప్రభావం తగ్గుతుంది. ఎండ వల్ల బడలిక, నీరసం రాకుండా ఉంటాయి.
పెరుగు: మజ్జిగ, లస్సీ, రైతా... ఏ రూపంలోనైనా పెరుగు తినొచ్చు. పెరుగు వల్ల అధిక ప్రయోజనం పొందాలంటే దీన్లో పచ్చి కూరగాయ ముక్కలు, పళ్ల ముక్కలు వేసుకుని తినాలి.
కొబ్బరి నీళ్లు: ఎండ వేడిమి నుంచి రక్షణ కల్పించే పోషకాలన్నీ కొబ్బరి నీళ్లలో ఉంటాయి. వేడి వాతావరణంతో పోరాడే శక్తి పొందాలంటే కొబ్బరినీళ్లు తాగుతూ ఉండాలి.
పుదీనా: పుదీనా తరిగి పెరుగు, మజ్జిగ, రైతాల్లో వేసుకుని తినాలి. పుదీనాతో పచ్చడి చేసుకుని కూడా తింటూ ఉండాలి. పుదీనా ఒంటి ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. కాబట్టి ఎండ వేడిమికి ఒళ్లు వేడెక్కి ఎండ దెబ్బ తగలకుండా ఉండాలంటే పుదీనాను ఆహారంలో చేర్చుకోవాలి.
నీళ్లు: దాహం వేసినా, వేయకపోయినా ఈ కాలంలో గంట గంటకూ నీళ్లు తాగుతూనే ఉండాలి. మరీ చల్లటి లేదా వేడి నీళ్లు తాగితే, వాటిని అరిగించకోవడానికి జీర్ణాశయం మీద ఒత్తిడి పెరుగుతుంది. పైగా రక్తంలో కలవటానికీ సమయం పడుతుంది. కాబట్టి గోరువెచ్చని నీళ్లు తాగాలి.
ఆకుపచ్చని కూరగాయలు: ఆకుపచ్చగా కనిపించే కూరగాయల్లో నీటి శాతం ఎక్కువ. కాబట్టి ఈ కాలంలో వీటిని ఆహారంలో ఎక్కువగా చేర్చుకుంటూ ఉండాలి. ఇందుకోసం ఆకుకూరలు, బీరకాయ, చిక్కుళ్లు, కీరా, దొండ, బెండకాయలను ఎంచుకోవాలి. వండేటప్పుడు పొడిగా కాకుండా, నీరు ఇంకిపోకుండా చిన్న మంట మీద ఉడికించి తినాలి.
ఉల్లిపాయలు: ఉల్లిపాయలు చల్లదనాన్నిస్తాయి. కాబట్టి కూరల్లోనే కాకుండా ఉల్లిముక్కలకు, నిమ్మరసం, ఉప్పు చేర్చి విడిగా కూడా తింటూ ఉండాలి. ఎర్రటి ఉల్లిపాయల్లో నీటి శాతం ఎక్కువ. కాబట్టి వీటినే ఎంచుకోవాలి.
క్యాబేజీ: క్యాబేజీలో నీరు ఎక్కువ. ఎండ బడలిక తీర్చే పోషకాలు దీన్లో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి క్యాబేజీ తరచుగా తీసుకుంటూ ఉండాలి. పచ్చి కూరగాయలతో కలిపి లేదా కూరగా వండుకుని తినొచ్చు. క్యాబేజీ పొడిగా తయారయ్యేవరకూ వండకుండా, నీరు ఊరి, దాన్లో ముక్కలు మెత్తబడేవరకూ కొన్ని నిమిషాలపాటు ఉడికిస్తే సరిపోతుంది. అప్పుడే దాన్లోని పోషకాలను నష్టపోకుంటా ఉంటాం!
బత్తాయి పళ్లు: వేసవిలో బాధించే ఒళ్లు నొప్పులు, బడలిక, నిస్సత్తువ వదలాలంటే బత్తాయి రసం తాగుతూ ఉండాలి. ఈ పళ్లలో 80 శాతం నీరే! కాబట్టి రోజంతా హుషారుగా ఉండాలంటే వీలున్నప్పుడల్లా బత్తాయి తొనలను నోట్లో వేసుకుంటూ ఉండాలి.
తీపి మొక్కజొన్న: సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల ప్రభావానికి గురికాకుండా ఉండాలంటే మొక్కజొన్న తింటూ ఉండాలి. వీటిని ఉప్పు లేకుండా ఉడకబెట్టుకుని తింటే రెట్టింపు ఫలితం ఉంటుంది. కొంతమంది వెన్న, మసాలా లాంటివి వాడుతూ ఉంటారు. వీటి వల్ల మొక్కజొన్నలోని పోషకాలు శరీరానికి పూర్తిగా అందకపోవచ్చు.
కీరా: వాపులు, నొప్పులు, మంటలు తగ్గించడంలో మేటి కీరా! పైగా దీన్లో నీటి శాతమూ ఎక్కువే! వేసవి దాహం తీరాలన్నా, పొట్టలో చల్లదనం పెంచాలన్నా కీరా తింటూ ఉండాలి. పచ్చి కూరగాయలతో కలిపి లేదా పెరుగులో వేసుకుని... ఎలా తిన్నా ఫలితం దక్కుతుంది.