AP Politics: దొంగ ఓట్ల వ్యవహారంపై సీఈసీకి బీజేపీ ఫిర్యాదు
ABN, Publish Date - Dec 14 , 2023 | 06:32 PM
AP BJP: ఏపీలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారంపై బీజేపీ సీరియస్ అయ్యింది. ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌ను బీజేపీ నేతలు పురంధేశ్వరి, సుజనా చౌదరి కలిసి నకిలీ ఓట్ల నమోదు, ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేశారు.
ఏపీలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారంపై బీజేపీ సీరియస్ అయ్యింది. ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌ను బీజేపీ నేతలు పురంధేశ్వరి, సుజనా చౌదరి కలిసి నకిలీ ఓట్ల నమోదు, ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. కొంతకాలంగా ఏపీలో ఓటర్ లిస్ట్ టాంపరింగ్ జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో సీఈసీని కలిశామని.. తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటర్ ఐడీ కార్డులు 35 వేలు డూప్లికేట్ చేసిన వాటికి సంబంధించిన రుజువులను ఎన్నికల సంఘానికి ఇచ్చామని పురంధేశ్వరి వెల్లడించారు. తిరుపతి ఉపఎన్నికల్లో దాదాపు 35 వేల మంది నకిలీ ఓట్లు వేశారని.. అలాగే విశాఖలో భౌతికంగా లేనివారికి సంబంధించి 61వేల ఓట్లు చేర్చారని ఆమె ఆరోపించారు. విశాఖపట్నం నార్త్‌లో ఇంటింటి సర్వే చేయగా 2 లక్షల 70 వేల మంది ఓటర్లు ఉంటే అదనంగా మరో 61 వేల మంది ఓట్లు యాడ్ చేశారన్నారు. దొంగ ఓట్లకు సంబంధించిన వాటికి రుజువు ఇచ్చామని.. కేంద్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. ఈ అంశంపై త్వరగా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారన్నారు. వాలంటీర్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని పురంధేశ్వరి ఆరోపించారు.
మరోవైపు ఇటీవల తుఫాన్ కారణంగా రైతులు పంట నష్టపోయారని పురంధేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంట నష్టం నిమిత్తం హెక్టారుకు రూ.30 వేలు ఇవ్వాలన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాలనే విధానం ప్రభుత్వం వద్ద ఉందా అని ప్రశ్నించారు. 22 మంది వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ఏం చేస్తున్నారో.. ఏం పైరవీలు చేస్తున్నారో అంటూ అసహనం వ్యక్తం చేశారు. మిచౌంగ్ తుపానును జాతీయవిపత్తుగా ప్రకటించాలని కోరామని.. బాధిత రైతులను సీఎం జగన్ కార్పెట్ వేసుకుని పరామర్శిస్తారా అని ఎద్దేవా చేశారు. ఆలుగడ్డకు.. ఉల్లిగడ్డకు తేడా తెలియని మనిషి సీఎం జగన్ అని పురంధేశ్వరి అన్నారు. డిమాండ్ల కోసం పోరాడుతున్న అంగన్వాడీలను అణచివేయడం దారుణమన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు ఓ రోజు వస్తుంది.. ఆరోజు వాళ్లంటే ఏంటో చూపిస్తారని అభిప్రాయపడ్డారు. ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపమే.. ఏపీ ప్రజల ఇబ్బందులకు కారణమన్నారు. ఏపీలో మార్పు మొదలైందని.. జగన్ సర్కార్‌కు శాపనార్ధాలు పెడుతున్నారని పురంధేశ్వరి స్పష్టం చేశారు.
మరోవైపు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ను టీడీపీ ఎంపీలు కూడా కలిశారు. సీఈసీని కలిసిన వారిలో ఎంపీలు కనకమేడల, గల్లా జయదేవ్, రామ్మోహన్‌నాయుడు ఉన్నారు. ఈ సందర్భంగా ఏపీలో నకిలీ ఓట్ల నమోదు, టీడీపీ ఓట్ల తొలగింపుపై ఈసీకి టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Dec 14 , 2023 | 07:38 PM