Delhi Liquor Scam : లిక్కర్ స్కామ్‌లో సిసోడియా అరెస్ట్‌పై ఫస్ట్ టైమ్ స్పందించిన కవిత.. ఏమన్నారంటే..!
ABN , First Publish Date - 2023-03-09T22:31:20+05:30 IST
దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi liquor Policy case) అరెస్టయ్యి తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను (Manish Sisodia) ఈడీ (ED Arrested) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే...
దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi liquor Policy case) అరెస్టయ్యి తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను (Manish Sisodia) ఈడీ (ED Arrested) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో గత మంగళవారమే అతడిని సీబీఐ (CBI) అరెస్ట్ చేసింది. 45 నిమిషాలపాటు ప్రశ్నించిన అనంతరం అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. సిసోడియా బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈ శుక్రవారం వాదనలు జరగనున్నాయి. అయితే సిసోడియా అరెస్ట్‌ను ఆప్ తీవ్రంగా తప్పుబడుతోంది. ఇప్పటికే పలువురు ఆప్ నేతలు, రాజకీయ ప్రముఖులు స్పందించగా.. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) స్పందించారు.
రియాక్షన్ ఇదీ..
మనీష్ సిసోడియా అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధమని కవిత వ్యాఖ్యానించారు. సిసోడియా అరెస్ట్‌ను ఆమె తీవ్రంగా ఖండించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు పారదర్శకంగా లేవని కవిత ఆరోపించారు. దర్యాప్తు సంస్థల ద్వారా కేంద్రంలోని బీజేపీ.. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా.. ఇదే లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ నుంచి నోటీసులు అందుకున్న కవిత మార్చి-11న విచారణకు హాజరుకానున్నారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలోనే కవిత విచారణకు కాబోతున్నారు. విచారణ తర్వాత కవితను అరెస్ట్ చేస్తారని బీజేపీ నేతలు జోస్యం చెబుతున్నారు. సిసోడియా మాదిరిగానే కవితను అరెస్ట్ చేయడం ఖాయమని తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు (TS BJP Leaders) మీడియా మీట్‌లు పెట్టి పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు.. ఆప్ పార్టీకి ఎన్నికల కోసం కవిత 150 కోట్ల రూపాయిలు లంచంగా ఇచ్చారని బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి సంచలన ఆరోపణలు చేయడం తెలంగాణలో హాట్ టాపిక్ అయ్యింది.
ఇదిలా ఉంటే.. కవితకు నోటీసులు ఇవ్వడాన్ని, బీజేపీ నేతల కామెంట్స్‌ను బీఆర్ఎస్ నేతలు, ప్రజా సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఇదంతా కేంద్రం కుట్రేనని ఆరోపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు సీబీఐ, ఈడీ, ఐటీలను తమ ఏజెంట్లుగా మార్చుకొని మోదీ సర్కార్ భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలను రూపుమాపి అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో అక్రమ దాడులకు పాల్పడుతోందని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జలకాంతం దుయ్యబట్టారు.