TS BJP: తెలంగాణ బీజేపీలో తారాస్థాయికి చేరుకున్న వర్గపోరు

ABN , First Publish Date - 2023-08-16T14:32:20+05:30 IST

మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్. మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు పూర్తి. సమయం లేదు. తీరిగ్గా కూర్చుని వ్యూహాలు రచించే టైమూ లేదు. మరోవైపు ప్రధాన ప్రత్యర్థి పార్టీలు కసరత్తులు ప్రారంభించి దూకుడు మీద ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కమలం పార్టీలో చోటుచేసుకున్న వర్గపోరు ఆ పార్టీని తీవ్ర కలవరం పెడుతుంది.

TS BJP: తెలంగాణ బీజేపీలో తారాస్థాయికి చేరుకున్న వర్గపోరు

హైదరాబాద్: మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్. మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు పూర్తి. సమయం లేదు. తీరిగ్గా కూర్చుని వ్యూహాలు రచించే టైమూ లేదు. మరోవైపు ప్రధాన ప్రత్యర్థి పార్టీలు కసరత్తులు ప్రారంభించి దూకుడు మీద ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కమలం పార్టీలో చోటుచేసుకున్న వర్గపోరు ఆ పార్టీని తీవ్ర కలవరం పెడుతుంది.

ప్రస్తుతం అంతా అయోమయం.. గందరగోళం నెలకొంది. దాదాపు 40 రోజులుగా ఎలాంటి కార్యక్రమాలు లేవు.. ఎలాంటి చప్పుడు లేదు. అంతా స్తబ్దత. రాష్ట్ర అధ్యక్షుడు మారినప్పుటి నుంచీ పార్టీలో ఏం జరుగుతుందో.. ఏంటోనన్న అయోమయం కార్యకర్తల్లో.. నేతల్లో నెలకొంది. ఇలాంటి తరుణంలో పార్టీలో నెలకొన్న వర్గపోరు హైకమాండ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇది రెడ్డి వర్సెస్ బీసీ అన్నట్టుగా మారడంతో ఢిల్లీ అగ్రనాయకత్వాన్ని తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది.

జాతీయ జెండా సాక్షిగా తెలంగాణ బీజేపీలో నెలకొన్న వర్గపోరు బజారునపడింది. ఆగస్టు 15న ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి-హమాయత్‌నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మీ భర్త రామన్నగౌడ్ వర్గీయుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ రచ్చక్కెంది. ఈ వ్యవహారం కాస్తా రెడ్డి వర్సెస్ బీసీగా మారడంతో మరింత అయోమయానికి గురిచేస్తోంది. గత కొద్ది రోజులుగా ఢిల్లీ అగ్ర నాయకత్వం బీసీలపై ప్రధాన దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఈటల రాజేందర్‌కు (Etala Rajender) పదవి ఇవ్వడం.. బండి సంజయ్‌ (Bandi Sanjay), ధర్మపురి అర్వింద్ లాంటి వాళ్లను ప్రోత్సహించినట్లు తెలుస్తోంది. కానీ తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు చేస్తుంటే.. పైకి మాత్రమే బీసీ జపం చేస్తున్నారు గానీ.. అంతర్గతంగా రెడ్డి సామాజికవర్గాన్ని ప్రోత్సహిస్తున్నారని రామన్నగౌడ్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. మీడియా సమక్షంలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. 30 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతుంటే.. చింతల రామచంద్రారెడ్డి మాత్రం తనను తొక్కేస్తున్నారని రామన్నగౌడ్ ఆవేదన చెందారు.

ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై ఇరు వర్గాల నేతలు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి (Kishan Reddy) ఫిర్యాదు చేశారు. ఎన్నికల ముందు గొడవలు పడడంపై కిషన్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీకి నష్టం జరిగే పనులు చేస్తే మాత్రం వేటు తప్పదని కిషన్‌రెడ్డి హెచ్చరించినట్లు సమాచారం.

ఓ వైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో వడపోతల్లో మునిగితేలుతుంటే.. కమలం పార్టీలో మాత్రం గ్రూప్ తగాదాలతో సతమతమవుతోంది. తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలు ఢిల్లీ అగ్ర నాయకత్వానికి చేరినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాలను ఎలా చక్కబెడుతుందో వేచి చూడాలి. అసంతృప్తులను బుజ్జగించి ముందుకెళ్తుందో.. లేదంటే ధిక్కార స్వరం వినిపించే నాయకులపై వేటు వేసి ముందుకు సాగిపోతుందో ముందు ముందు చూడాలి.

Updated Date - 2023-08-16T14:56:11+05:30 IST