Telangana politics: బీఆర్ఎస్‌కు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గుడ్‌బై??.. మల్లు రవితో భేటీ... జూపల్లి కూడా..
ABN, First Publish Date - 2023-06-10T16:17:37+05:30
కర్ణాటక ఎన్నికల్లో (Karnataka elections) కాంగ్రెస్ తిరుగులేని విజయం సాధించడం తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress)లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది.
హైదరాబాద్: బీఆర్ఎస్ బహిష్కృత నేత జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. శనివారం కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవితో జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. రవి ఇంటికి స్వయంగా వెళ్లి చర్చలు జరిపారు. జూపల్లి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి కూడా మల్లు రవితో భేటీ కానున్నారని తెలుస్తోంది. త్వరలో దామోదర్ రెడ్డి, ఆయన కుమారుడు రాజేష్ రెడ్డి కాంగ్రెస్ చేరుతారనే ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి!
జూపల్లి, పొంగులేటి కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైనట్టు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నేతలతో చర్చోపచర్చల అనంతరం వారిద్దరూ కాంగ్రెస్‌లోనే చేరేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. జూపల్లి కృష్ణారావు సొంత నియోజకవర్గం నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లోని తన అనుచరులు, అభిమానుల నుంచి విస్తృత స్థాయిలో వచ్చిన అభిప్రాయాలకు తోడు, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి, నాగర్‌కర్నూల్, అలంపూర్, గద్వాల, అచ్చంపేట నియోజకవర్గాల్లో తనతో కలిసొచ్చేవారి అభిప్రాయాల మేరకు కాంగ్రెస్‌లోనే చేరాలనే తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని జూపల్లి సన్నిహితులు, అనుచరులు బహిరంగంగానే తెలియజేస్తున్నారు. మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన అనుచరులతో శుక్రవారం కీలక సమావేశాన్ని నిర్వహించారు. అనుచరులంతా కాంగ్రెస్‌లోనే చేరాలని చెప్పడంతో ఆయన కూడా కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైంది. త్వరలో పొంగులేటి, జూపల్లి త్వరలోనే కాంగ్రెస్‌లో చేరే అవకాశాలున్నాయి.
కర్ణాటక జోష్...
కర్ణాటక ఎన్నికల్లో (Karnataka elections) కాంగ్రెస్ తిరుగులేని విజయం సాధించడం ఆ పార్టీకి తెలంగాణలో (Telangana Congress) రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలంతా ఐక్యంగా కష్టపడితే విజయం సులువవుతుందనే ధీమాను కలిగించింది. అందులో భాగంగానే ఇప్పటికే ఏఐసీసీ తెలంగాణపై ఫోకస్ పెట్టింది.
Updated Date - 2023-06-10T16:43:01+05:30 IST