North Telangana:ఆ రెండు స్థానాల్లో ఓటమితో కళ్లు తెరిచిన కేసీఆర్..ముల్లును ముల్లుతోనే తీయాలని చూస్తోన్న గులాబీ బాస్..?
ABN, First Publish Date - 2023-03-04T11:37:04+05:30
ఉత్తర తెలంగాణలో గత పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ చేదు ఫలితాలను చవిచూశారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాల్లో
ఉత్తర తెలంగాణలో పుంజుకుంటున్న బీజేపీకి.. బీఆర్ఎస్ బ్రేకులు వేయబోతోందా?.. రెండేళ్ల క్రితమే గులాబీ బాస్ వ్యూహాలు రచించారా?.. ముల్లును ముల్లుతోనే తీయాలన్న సామెతను కమలంపార్టీపై ప్రయోగిస్తున్నారా?.. కొండగట్టుకు వందల కోట్ల కేటాయింపు.. ఎన్నికల స్టంటేనా?.. ఉత్తర తెలంగాణలో కేసీఆర్ రచించిన వ్యూహాలేంటి?.. బీజేపీ స్పీడ్‌కు ఎలా బ్రేకులు వేయబోతున్నారు?..మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..
2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లే కరువు
ఉత్తర తెలంగాణలో గత పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ చేదు ఫలితాలను చవిచూశారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ చేతిలో బీఆర్‌ఎస్ దారుణంగా ఓడిపోయిది. పైగా.. నిజామాబాద్, కరీంనగర్‌తోపాటు.. ఢిల్లీలో ఆయనకు కుడి, ఎడమ భుజాలుగా ఉన్న వినోద్‌కుమార్, కవిత ఓటమి పాలవ్వడం కోలుకోలేని దెబ్బ తీసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చాలా చోట్ల డిపాజిట్లే రాని బీజేపీ.. పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకోవడం జీర్ణించుకోలేకపోయారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత హిందూత్వంపై కేసీఆర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బీజేపీ నేతలు జనంలోకి బలంగా తీసుకువెళ్లారు. మరీ ముఖ్యంగా.. జై శ్రీరామ్ సెంటిమెంట్‌ను ఉత్తర తెలంగాణలో బలంగా వినిపించారని చెప్పొచ్చు.
3 పార్లమెంట్ సెగ్మెంట్లలో బీజేపీ విజయకేతనం
వాస్తవానికి... కొండగట్టు అంజన్నస్వామిని ప్రతిఏటా లక్షలాది హనుమాన్ భక్తులు దర్శించుకుంటారు. అలాంటి ఆలయం ఇప్పటివరకు అభివృద్ధి జరగలేదు. సొంత రాష్ట్రంలోనూ.. హనుమాన్ భక్తులు కొండగట్టు గుట్టపై గుక్కెడు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆ మైనస్‌లు, అప్పట్లోని మోదీ మేనియాతో మూడు పార్లమెంట్ సెగ్మెంట్లలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. నిజామాబాద్‌లో కల్వకుంట్ల కవితను ధర్మపురి అరవింద్ ఓడించి ఒక్కసారిగా తెరపై తళుక్కున మెరిశారు. అదే సమయంలో.. కేసీఆర్ రాజకీయ వ్యూహాల్లో చేదోడు వాదోడుగా ఉండే వినోద్‌కుమార్‌ను కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బండి సంజయ్ ఓడించారు. ఆ రెండు స్థానాల్లో ఓటమి.. కేసీఆర్‌కు కంట్లో నలుసులా మారింది. ఆ తర్వాత.. బీజేపీ వెనక్కి తిరిగి చూడకుండా.. గట్టి వ్యూహాలు పన్నుతూ పుంజుకోవడం ప్రారంభించింది. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన బీజేపీ.. మునుగోడు ఉపఎన్నికల్లోనూ హోరాహోరీగా పోరాడింది. బీఆర్‌ఎస్‌కు ఓ రేంజ్‌లో భయం పుట్టించింది.
మళ్లీ వస్తా.. 1000 కోట్లయినా ఇస్తానని ప్రకటన
మరోవైపు.. ఎంపీగా గెలిచిన తర్వాత పరిణామాలు.. బండి సంజయ్‌కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి పదవి కట్టబెట్టేలా చేశాయి. అవన్నీ కేసీఆర్‌కు ఏమాత్రం మింగుడు పడలేదు. అందుకే.. ఎమ్మెల్సీ కవితకు కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం అభివృద్ధి బాధ్యతలను అప్పగించారు. రెండేళ్లుగా కొండగట్టులో శ్రీరామ స్తూపం నిర్మాణం.. హనుమాన్ చాలీసా పారాయణం లాంటి కార్యక్రమాలతో కవిత హడావుడి చేశారు. బీజేపీ.. జై శ్రీరామ్ అంటే.. మనం జై హనుమాన్ అనాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. అలా.. ఉత్తర తెలంగాణలో బీజేపీని ఓవర్ టేక్ చేసేందుకు.. కేసీఆర్ రెండేళ్ల క్రితమే వ్యూహాలు రచించారు. 9 ఏళ్లుగా కొండగట్టు దేవాలయానికి రాని.. ఆయన.. తొలిసారి అంజన్నను దర్శించుకున్నారు. ఇన్నేళ్లలో ఒక్క రూపాయి కూడా కేటాయించని ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా.. కొండగట్టు ఆలయానికి 100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. అంతటితో ఆగకుండా తాజాగా మరో 500 కోట్లు కూడా కేటాయిస్తున్నామని స్వయంగా కేసీఆరే ప్రకటించడం చర్చగా మారింది. అభివృద్ధి సమీక్షలో.. మళ్లీ వస్తా.. 1000 కోట్లయినా ఇస్తానని ఆయన చేసిన ప్రకటన.. స్థానిక నేతలను ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే.. అదంతా.. ఉత్తర తెలంగాణలో బీజేపీ స్పీడ్‌కు బ్రేకులు వేయడంలో భాగమేనన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
దమ్ముంటే కొండగట్టుకు నిధులు తేవాలని డిమాండ్
ఇదిలావుంటే.. కేసీఆర్ పర్యటనకు ముందే మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్.. బీజేపీపై ఓ స్థాయిలో విరుచుకుపడ్డారు. కొండగట్టుకు 100 కోట్లు కేటాయించామని.. హిందూ జపం చేస్తున్న బీజేపీకి దమ్ముంటే 100 కోట్లు ఇవ్వాలని సవాల్ విసిరారు. ఆ సవాల్ బీజేపీని ఇరకాటంలో పెట్టిందని చెప్పొచ్చు. బండి సంజయ్ పార్లమెంట్ పరిధిలోనే కొండగట్టు క్షేత్రం ఉంది. కొండగట్టుకు సంజయ్.. కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెస్తారో చెప్పాలని.. గంగులతోపాటు.. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కూడా సవాల్ చేశారు. హిందూ జపం చేయడం కాదు.. దమ్ముంటే కేంద్రం నుంచి కొండగట్టుకు నిధులు తేవాలని డిమాండ్ చేశారు.
Updated Date - 2023-03-04T11:38:48+05:30 IST