BJP MP Arvind: అధ్యక్ష పదవి పవర్ సెంటర్ కాదంటూ బండి సంజయ్‌పై ఎంపీ అర్వింద్‌ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-03-12T18:27:22+05:30 IST

తెలంగాణ రాష్ట్ర బీజేపీ (BJP) అధ్యక్షుడు, కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay) పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్‌ (MP Arvind) కీలక వ్యాఖ్యలు చేశారు.

BJP MP Arvind: అధ్యక్ష పదవి పవర్ సెంటర్ కాదంటూ బండి సంజయ్‌పై ఎంపీ అర్వింద్‌ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర బీజేపీ (BJP) అధ్యక్షుడు, కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay) పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్‌ (MP Arvind) కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) పై బండి సంజయ్ వ్యాఖ్యలను తాను సమర్థించనని అర్వింద్‌ అన్నారు. బండి సంజయ్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అర్వింద్ డిమాండ్ చేశారు. అధ్యక్ష పదవి అనేది పవర్ సెంటర్ కాదు.. కోఆర్డినేట్ సెంటర్‌ అంటూ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్‌ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని ఎంపీ అర్వింద్‌ అన్నారు. సంజయ్ వ్యాఖ్యలకు బీజేపీకి సంబంధం ఉందని తాను ఒప్పుకోను అని, సంజయ్‌ వ్యాఖ్యలకు ఆయనే వివరణ ఇచ్చుకోవాలని అర్వింద్‌ స్పష్టం చేశారు.

కవిత లిక్కర్ స్కాంకు, తెలంగాణ సమాజానికి సంబంధం ఏంటని అన్నారు. తెలంగాణ సమాజానికి చెప్పి కవిత లిక్కర్ దందా చేసిందా అంటూ నిలదీశారు. ఉద్యమకారుల గురించి పట్టించుకోని కేసీఆర్.. తన కుటుంబానికి ఆపద వస్తే వణికిపోతున్నారన్నారు. అవినీతిపరులు ఎవరైనా మోదీ సర్కార్ (Modi Government) వదిలే ప్రసక్తే లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు.

అలాగే మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం ఢిల్లీలో కవిత చేపట్టిన ధర్నాపై బండి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కాదు.. ప్రగతి భవన్ ముందు కవిత ధర్నా చేయాలన్నారు. 33 శాతం బీఆర్ఎస్ టికెట్లు మహిళలకు ఇవ్వనందుకు తన తండ్రి కేసీఆర్‌ను కవిత ప్రశ్నించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ 33శాతం రిజర్వేషన్ గురించి ఎందుకు పార్లమెంట్‌లో మాట్లాడలేదని ప్రశ్నించారు. కేసీఆర్ బిడ్డ కవిత వలన మహిళా లోకం తల దించుకునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. తన దందాలో నుంచి కవిత పేద మహిళలకు వాటా ఇవ్వాలన్నారు. కేసీఆర్ క్యాబినెట్‌లో 33శాతం మహిళా మంత్రులు ఎందుకు లేరని నిలదీశారు. బీఆర్ఎస్ నాయకులే మహిళలకు శాపంగా మారారన్నారు. కేసీఆర్ హయాంలో మహిళా సర్పంచ్‌కే రక్షణ లేకుంటే.. సామాన్యల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. జాన్సీ లక్ష్మీబాయి, రాణీరుద్రమదేవి మాదిరి కవిత తనను తాను ఊహించుకుంటోందని ఎద్దేవా చేశారు. మహిళల రిజర్వేషన్లు గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌కు లేదన్నారు. మహిళల పట్ల‌ సీఎం కేసీఆర్ కోపం, కసితో వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-03-12T18:32:44+05:30 IST