Heart Attack: శృంగార సామర్థ్యం తగ్గడం దేనికి సంకేతం.. గుండెపోటు ముప్పు పొంచి ఉన్నట్టేనా?
ABN, First Publish Date - 2023-02-04T15:50:24+05:30
ప్రస్తుత కాలంలో రకరకాల కారణాల వల్ల చాలా మంది యువకులకు కూడా అంగ స్తంభన సమస్యలు (Erectile dysfunction) ఎదురవుతున్నాయి. అంగస్తంభన సమస్యలు మొదలవడం హృదయ సంబంధ సమస్యలకు (Heart Problems) తొలి సంకేతమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుత కాలంలో రకరకాల కారణాల వల్ల చాలా మంది యువకులకు కూడా అంగ స్తంభన సమస్యలు (Erectile dysfunction) ఎదురవుతున్నాయి. 40 ఏళ్లు కూడా దాటక ముందే చాలా మంది శృంగార సామర్థ్యాన్ని కోల్పోతున్నారు. ఇలా అంగస్తంభన సమస్యలు మొదలవడం హృదయ సంబంధ సమస్యలకు (Heart Problems) తొలి సంకేతమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హృదయ సంబంధ సమస్యలకు, అంగ స్తంభన సమస్యకు చాలా దగ్గర సంబంధం ఉందట. గుండె సమస్యకు చికిత్స తీసుకుంటే అంగ స్తంభన సమస్య కూడా తగ్గిపోతుందట.
రక్తనాళాల లోపలి పొర (ఎండోథెలియం), మృదు కండరాలు డ్యామేజ్ కావడం వల్ల గుండె సమస్యలు, అంతకంటే ముందు అంగస్తంభన సమస్య తలెత్తుతాయని నిపుణులు విశ్వసిస్తున్నారు. ఎండోథెలియం (endothelium) డిస్‌ఫంక్షన్ కారణంగా గుండెకు తగినంత రక్త సరఫరా జరగదు. ఫలితంగా గుండె నుంచి పురుషాంగానికి రక్త ప్రసరణ తగ్గిపోతుంది. దీంతో అంగం స్తంభించదు. కాబట్టి అంగ స్తంభన సమస్య మొదలైందంటే భవిష్యత్తులో గుండె సంబంధిత సమస్య కూడా తలెత్తే ప్రమాదముందని భావించి ముందుగానే జాగ్రత్త పడాలి.
అలాగే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడినా పురుషాంగానికి తగినంత రక్త సరఫరా జరగదు. అది కూడా గుండె సంబంధిత సమస్యగానే భావించాలి. కాకపోతే, అంగస్తంభన సమస్య ఉన్న ప్రతీ ఒక్కరికీ గుండె సమస్య ఉందని భావించనక్కర్లేదు. చిన్నప్పటి నుంచి ఆ సమస్య లేకుండా మధ్యలో మొదలైనా, గాయం వంటి స్పష్టమైన కారణం లేకుండా అంగస్తంభన సమస్యను కలిగి ఉన్నా, ఆ వ్యక్తులు ముందుగా గుండె జబ్బు ఉందేమో పరీక్షించుకోవాలి. అలాగే మధుమేహం (Diabetes), రక్తపోటు (High blood pressure), కొలస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలి.
Updated Date - 2023-02-04T15:50:25+05:30 IST