Kids Health: 6నెలలలోపు పిల్లలకు మంచినీరు తాగిస్తుంటారా? అలా చేస్తే జరిగేదిదే..
ABN , First Publish Date - 2023-11-17T13:16:02+05:30 IST
రెండు మూడు నెలలు దాటగానే చాలామంది పిల్లలకు నీరు ఇస్తుంటారు. దీనివల్ల శరీరంలో ఈ అవయవం దారుణంగా దెబ్బతింటుంది.
చిన్న పిల్లలకు తల్లిపాలే ఆహారం. పుట్టినప్పటి నుండి సుమారు 6నెలల వరకు పిల్లలకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. లేదంటే వైద్యుల సలహాతో ఫార్ములా పాలు ఇవ్వాలి. కానీ చాలామంది పిల్లలకు రెండు మూడు నెలల వయసు రాగానే నీరు ఇస్తుంటారు. ముఖ్యంగా వేసవి కాలం వచ్చినప్పుడు, వాతావరణం వేడిగా ఉన్నప్పుడు నీరు ఇవ్వడం మంచిదేనని కూడా అనుకుంటారు. కానీ ఆరు నెలల లోపు వయసున్న పిల్లలకు నీరు ఇవ్వడం మంచిది కాదని చిన్న పిల్లల వైద్యులు చెబుతున్నారు. అసలు 6నెలల లోపు పిల్లలకు నీరు ఎందుకివ్వకూడాదు. ఇస్తే జరిగేదేంటి?
6నెలల లోపు పిల్లలకు తల్లిపాలు లేదా పార్ములా పాలద్వారానే వారి శరీరానికి కావలసిన నీటి శాతం అందుతుంది. దీనివల్ల పిల్లల శరీరం హైడ్రేట్ గానే ఉంటుంది. ఒక వేళ నీటిని పిల్లలకు ఇస్తే తల్లిపాలు లేదా ఫార్ములా పాల ద్వారా పిల్లలకు అందాల్సిన పోషకాలు అందకుండా పోతాయి.
నీటిని తాగడం వల్ల పిల్లలకు ఎలాంటి శక్తి లభించదు. నీటిలో ఎలాంటి కేలరీలు ఉండవు. 6నెలల లోపు పిల్లలకు నీరు ఇస్తే అది పిల్లల ఎదుగుదలను ప్రభావితం చేస్తుంది.
ఇది కూడా చదవండి: మగవారు పూల్ మఖనా ఎందుకు తినాలంటే..
6నెలల లోపు పిల్లలకు నీరు ఇవ్వడం వల్ల వారి శరీరంలో మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఏమవుతుందిలే కొద్దిగానే కదా ఇస్తున్నాం అనే నిర్లక్ష్యంతో ఎప్పుడూ పిల్లలకు నీరు ఇవ్వకూడదు.
తల్లిపాలలో సహజంగానే 90శాతం నీరు ఉంటుంది. ఇది శరీరం హైడ్రేట్ గా ఉండటానికి సరిపోతుంది. ఇక ఇందులో పిల్లలకు కావలసినంత కేలరీలు, కొవ్వు, ప్రోటీన్లు అందుతాయి. కానీ నీరు ఇవ్వడం వల్ల పిల్లలు ఈ పోషకాలు కోల్పోతారు.
వేసవికాలంలో లేదా పిల్లలకు జ్వరం వచ్చిన సమయంలో వేడినీటిని స్పూన్లతో ఇస్తుంటారు. కానీ వైద్యుల సలహా లేకుండా అస్సలు నీరు ఇవ్వకూడదు. 6నెలల తరువాత మాత్రమే పిల్లలకు తేలికపాటి ఆహారం, అప్పుడప్పుడూ కొద్దిగా నీరు ఇవ్వవచ్చు.