World's Richest T20 League: ఐపీఎల్ యజమానులకు సౌదీ ఆఫర్‌.. బీసీసీఐ తేల్చేసింది!

ABN , First Publish Date - 2023-04-15T16:42:18+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2023) లాంటిదే తమ దేశంలోనూ ఏర్పాటు చేయాలని

World's Richest T20 League: ఐపీఎల్ యజమానులకు సౌదీ ఆఫర్‌.. బీసీసీఐ తేల్చేసింది!

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2023) లాంటిదే తమ దేశంలోనూ ఏర్పాటు చేయాలని యోచిస్తున్న సౌదీ అరేబియా(Saudi Arabia).. ఐపీఎల్ యజమానులను సంప్రదిస్తోందన్న వార్తలపై బీసీసీఐ(BCCI) స్పందించింది. ‘ప్రపంచంలోనే అత్యంత సంపన్న టీ20 లీగ్’(World's Richest T20 League)ను ఏర్పాటు చేసేందుకు సౌదీ రెడీ అవుతోందని, అదే జరిగితే ఐపీఎల్‌(IPL)కు పోటీ తప్పదంటూ వార్తలు వచ్చాయి.

ఈ వార్తలపై తాజాగా బీసీసీఐ స్పందించినట్టు తెలుస్తోంది. ఇలాంటి లీగుల్లో ఆడేందుకు టాప్ ఇండియన్ క్రికెటర్లను అనుమతించబోమని తేల్చి చెప్పినట్టు సమచారం. ఇప్పటికే ఇలాంటి విధానం కొనసాగుతోంది. విదేశీ లీగుల్లో ఇండియన్ క్రికెటర్లు ఆడకుండా బీసీసీఐ నిషేధం విధించింది. అయితే, సౌదీ ప్రభుత్వం కనుక కొత్త టీ20 లీగ్ ఏర్పాటు చేస్తే బీసీసీఐ విధానంలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉందన్న వార్తలు కూడా వచ్చాయి.

ప్రపంచంలోనే అత్యంత సంపన్న టీ20 లీగ్ ఏర్పాటు కోసం సౌదీ అరేబియా ఏడాది కాలంగా చర్చలు జరుపుతున్నట్టు ‘ది ఏజ్’ పేర్కొంది. సౌదీ అరేబియా చేస్తున్న ఈ ప్రయత్నాలు పట్టాలెక్కాలంటే తొలుత ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) అనుమతి తప్పనిసరి. కాగా, క్రికెట్‌పై సౌదీ అరేబియా ఆసక్తిగా ఉన్నట్టు ఇటీవలే ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బర్కలీ పేర్కొనడం గమనార్హం.

ఇతర లీగుల్లో టాప్ ఇండియన్ ప్లేయర్లు ఆడేందుకు అనుమతి ఇవ్వబోమన్న బీసీసీఐ.. ఫ్రాంచైజీ భాగస్వామ్యాన్ని మాత్రం ఆపలేమని బీసీసీఐ అన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్‌కు ఆడుతున్న ఏ ఆటగాడినీ ఇతర లీగుల్లో ఆడేందుకు అనుమతివ్వబోమని బీసీసీఐ అధికారిని ఉంటంకిస్తూ ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పేర్కొంది. అయితే, ఫ్రాంచైజీలను మాత్రం తాము ఆపలేమని ఆయన పేర్కొనట్టు తెలిపింది. అది వారి వ్యక్తిగత నిర్ణయానికే వదిలేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు దక్షిణాఫ్రికా, దుబాయ్ వెళ్లడాన్ని మనం చూశామని, కానీ వారికి తాము ‘నో’ చెప్పలేదని అన్నారు. ప్రపంచంలో ఏ లీగులోనైనా తమ జట్టు ఉండాలనుకోవడం వారిష్టమని అన్నారు.

Updated Date - 2023-04-15T17:39:39+05:30 IST