AUS vs PAK: సిక్స్ కొట్టకుండా ఒక్క బంతికి 7 పరుగులు.. ఎలా అంటే..?
ABN , First Publish Date - 2023-12-08T19:55:28+05:30 IST
AUS vs PAK: ఆస్ట్రేలియాతో మూడు టెస్టుల సిరీస్ ముందు ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో పాకిస్థాన్ వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో ఒక బంతికి ఏడు పరుగులు సాధించడంతో ప్రైమ్ మినిస్టర్స్ XI ఆటగాడు మాథ్యూ రెన్షా హాఫ్ సెంచరీ సాధించాడు.
వన్డే ప్రపంచకప్, టీమిండియాతో టీ20 సిరీస్ తర్వాత ఆస్ట్రేలియా సొంతగడ్డపై పాకిస్థాన్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. అయితే ప్రస్తుతం పాకిస్థాన్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో పాకిస్థాన్ ఆడుతున్న నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో ఒక బంతికి ఏడు పరుగులు సాధించడంతో ప్రైమ్ మినిస్టర్స్ XI ఆటగాడు మాథ్యూ రెన్షా హాఫ్ సెంచరీ సాధించాడు. 24వ ఓవర్ చివరి బంతికి రెన్షా ఆఫ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ వేసిన బంతిని కవర్స్ మీదుగా ఆడాడు. పాకిస్థాన్ ఆటగాడు మీర్ హంజా డైవ్ చేసి బంతిని ఆపి స్టంప్స్ వైపు కొట్టాడు. రెన్షా రన్స్ తీస్తుండగా బాబర్ ఆజమ్ బంతిని నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు విసిరాడు. అయితే బాల్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్, కెప్టెన్ షాన్ మసూద్ మధ్య నుంచి ఫోర్ వెళ్లడంతో మొత్తం ఏడు పరుగులు వచ్చాయి. బంతి బౌండరీకి వెళ్లకముందే బ్యాటర్లు మూడు పరుగులు సాధించారు.
అంతకుముందు కెప్టెన్ షాన్ మసూద్ డబుల్ సెంచరీ సాధించడంతో పాకిస్తాన్ తొమ్మిది వికెట్ల నష్టానికి 391 పరుగుల వద్ద తమ స్కోరు డిక్లేర్ చేసింది. షాన్ మసూద్ 298 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 201 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అబ్దుల్లా షఫీక్, బాబర్, సర్ఫరాజ్ వరుసగా 38, 40, 41 పరుగులు చేశారు. ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ బౌలర్ జోర్డాన్ బకింగ్‌హామ్ 23 ఓవర్లు బౌలింగ్ చేసి 80 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. వార్మప్ మ్యాచ్ తర్వాత పెర్త్ స్టేడియంలో డిసెంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్ట్‌లో పాట్ కమ్మిన్స్ ఆధ్వర్యంలోని ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ తలపడనుంది. మిగతా రెండు టెస్టులకు మెల్‌బోర్న్, సిడ్నీ ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.