Dhoni Record: ధోనీ నెలకొల్పిన రికార్డును అధిగమించిన దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్
ABN , First Publish Date - 2023-09-25T20:12:39+05:30 IST
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నెలకొల్పిన ఓ రికార్డును దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ తాహిర్ అధిగమించాడు. 44 ఏళ్ల వయసులో ఫ్రాంచైజీ లీగ్ టైటిల్ గెలిచిన తొలి కెప్టెన్‌గా అతడు తన పేరును లిఖించుకున్నాడు.
ఐపీఎల్ ఇచ్చిన ప్రోత్సాహంతో అన్ని దేశాల్లోనూ క్రికెట్ లీగ్‌లు జోరుగా సాగుతున్నాయి. తాజాగా కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ నిర్వహించగా ఇమ్రాన్ తాహిర్ సారథ్యం వహించిన గయానా అమెజాన్ వారియర్స్ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నెలకొల్పిన ఓ రికార్డును దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ తాహిర్ అధిగమించాడు. 44 ఏళ్ల వయసులో ఫ్రాంచైజీ లీగ్ టైటిల్ గెలిచిన తొలి కెప్టెన్‌గా అతడు తన పేరును లిఖించుకున్నాడు. గతంలో ఈ రికార్డు మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉండేది. 41 ఏళ్ల వయసులో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ధోనీ ఐపీఎల్ 2023 టైటిల్ సాధించాడు. ఇప్పుడు ఈ రికార్డును ఇమ్రాన్ తాహిర్ బద్దలు కొట్టాడు. దీంతో 44 ఏళ్ల వయసులోనూ తన జట్టును గెలిపించిన తాహిర్‌ను చూసి ముసలోడే కానీ మహానుభావుడు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్‌లు కామెంట్లు పెడుతున్నారు.
కాగా కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఫైనల్ సోమవారం రాత్రి జరిగింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్టు 18.1 ఓవర్లలో 94 పరుగులకు ఆలౌటైంది. కీస్ కార్టీ(38) మినహా ఇతర బ్యాటర్లు రాణించలేదు. నికోలస్ పూరన్(1), అకీల హోస్సెన్(1), ఆండ్రీ రస్సెల్(3), డ్వేన్ బ్రావో(1), సునీల్ నరైన్(1) దారుణంగా విఫలమయ్యారు. అనంతరం ఇమ్రాన్ తాహిర్ ఆధ్వర్యంలోని అమెజాన్ వారియర్స్ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించి తొలిసారి టైటిల్ ముద్దాడింది. ఈ లీగ్‌లో ఫైనల్ మ్యాచ్‌తో కలిపి ఇమ్రాన్ తాహిర్ 6 వికెట్లు పడగొట్టాడు.
ఇది కూడా చదవండి: ODI World Cup 2023: ప్రపంచకప్‌కు టీమిండియా ఆల్ సెట్.. ఇదే ఫైనల్ ఎలెవన్..!!
కాగా ఫైనల్లో తన జట్టు విజయం సాధించిన తర్వాత ఇమ్రాన్ తాహిర్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ గెలుపు వెనుక టీమిండియా క్రికెటర్ అశ్విన్ ఉన్నాడని చెప్పాడు. ఈ సందర్భంగా అతడికి ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలిపాడు. తనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ఒకప్పుడు రవిచంద్రన్ అశ్విన్ చెప్పిన మాటలను తాహిర్ గుర్తుచేసుకున్నాడు. ఈ సీజన్ ప్రారంభానికి ముందు కెప్టెన్‌గా రాణిస్తానని అశ్విన్ తనలో నమ్మకం కలిగించాడని తాహిర్ వెల్లడించాడు. ఐపీఎల్‌లో 59 మ్యాచ్‌లు ఆడిన ఇమ్రాన్ తాహిర్ 82 వికెట్లు తీశాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున రెండేళ్లు ఆడగా.. చెన్నై జట్టులో మూడేళ్ల వ్యవధిలోనే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు.