MS Dhoni: ఆప్ఘనిస్తాన్ ఆటగాడికి ధోనీ ఆఫర్.. పొట్ట తగ్గించుకుంటే ఐపీఎల్‌లో తీసుకుంటాం
ABN , First Publish Date - 2023-12-08T18:35:50+05:30 IST
MS Dhoni: టీమిండియాకు రెండు వరల్డ్ కప్‌లు అందించిన మహేంద్రసింగ్ ధోనీపై ఆప్ఘనిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ అస్గర్ ప్రశంసలు కురిపించాడు. తమ జట్టులో షెహజాద్ ధోనీ అభిమాని అని.. అయితే అతడికి పెద్ద పొట్ట ఉందని.. 20 కిలోలు తగ్గితే అతడిని ఐపీఎల్‌లో తీసుకుంటామని ధోనీ ఆఫర్ ఇచ్చాడని మహ్మద్ అస్గర్ అన్నాడు.
ఆప్ఘనిస్తాన్ క్రికెటర్ షెహజాద్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భారీ కాయంతో పాటు భారీ షాట్లు కొట్టగల సామర్థ్యం అతడికి ఉంది. దీంతో అతడిని ఐపీఎల్‌లోకి తీసుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ విషయాన్ని ఆప్ఘనిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ అస్గర్ వెల్లడించాడు. 2018లో జరిగిన ఆసియా కప్‌లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత్‌తో జరిగిన టై మ్యాచ్‌ను మహ్మద్ అస్గర్ గుర్తుచేసుకున్నాడు. ఈ సందర్భంగా అతడు ధోనీపై ప్రశంసలు కురిపించాడు. భారత క్రికెట్‌కు ధోనీ దేవుడు ఇచ్చిన బహుమతి అని ప్రశంసించాడు. తమ జట్టులో షెహజాద్ ధోనీ అభిమాని అని.. అయితే అతడికి పెద్ద పొట్ట ఉందని.. 20 కిలోలు తగ్గితే అతడిని ఐపీఎల్‌లో తీసుకుంటామని ధోనీ ఆఫర్ ఇచ్చాడని మహ్మద్ అస్గర్ అన్నాడు. కానీ షెహజాద్ మరో ఐదు కిలోలు పెరిగాడని నవ్వుతూ చెప్పాడు.
కాగా 2015 నుంచి 2021 వరకు ఆప్ఘనిస్తాన్ జట్టుకు మహ్మద్ అస్గర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతడు ఆప్ఘనిస్తాన్ తరఫున ఆరు టెస్టులు, 114 వన్డేలు, 75 టీ20లు ఆడాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఆప్ఘనిస్తాన్ మంచి ప్రదర్శన చేసిందని అస్గర్ అన్నాడు. 2015లో తాను కెప్టెన్‌గా ఉన్నప్పుడు తమ జట్టు పునర్నిర్మాణ దశలో ఉందని.. ఇప్పుడు తమ జట్టు గొప్ప ప్రదర్శన చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు. నిజంగా చెప్పాలంటే ఆప్ఘనిస్తాన్ క్రికెట్ అభివృద్ధిలో బీసీసీఐ కీలక పాత్ర పోషిందని అస్గర్ వెల్లడించాడు. తమకు ఇప్పటికీ బీసీసీఐ నుంచి మంచి సహకారం అందుతోందన్నాడు. తమ క్రికెటర్లు రాటు దేలడానికి ఐపీఎల్ ఎంతో ఉపయోగపడుతుందని.. రషీద్ ఖాన్ లాంటి స్టార్లు ఐపీఎల్ కారణంగానే వెలుగులోకి వచ్చారని మహ్మద్ అస్గర్ పేర్కొన్నాడు. భారత్ తరహాలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ కూడా ఆప్ఘనిస్తాన్ క్రికెట్‌కు మద్దతు ఇవ్వాలని కోరాడు.
మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.