AUS Vs PAK: పావురాల వల్ల నిలిచిన ఆట.. కష్టపడ్డ ఆస్ట్రేలియా ఆటగాళ్లు
ABN, Publish Date - Dec 26 , 2023 | 08:04 PM
AUS Vs PAK: ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న టెస్టులో లబుషేన్, స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పావురాల వల్ల ఆటకు అంతరాయం కలిగింది. మైదానంలో పావురాలు వచ్చి ఉండటంతో వాటిని బయటకు పంపించడానికి లబుషేన్ తీవ్రంగా కష్టపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య బాక్సింగ్ డే టెస్టు జరుగుతోంది. ఈ టెస్టులో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. వర్షం కారణంగా తొలి రోజు ఆట 66 ఓవర్లు మాత్రమే సాగింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం లభించింది. డేవిడ్ వార్నర్ (38), ఉస్మాన్ ఖవాజా (42) తొలి వికెట్‌కు 90 పరుగులు జోడించారు. వీళ్లిద్దరూ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన లబుషేన్ మరో ఆటగాడు స్టీవ్ స్మిత్ (26)తో కలిసి స్కోరు బోర్డు ముందుకు నడిపించాడు. అయితే వీళ్లిద్దరూ బ్యాటింగ్ చేస్తున్న టైమ్‌లో పావురాల వల్ల ఆటకు అంతరాయం కలిగింది. మైదానంలో పావురాలు వచ్చి ఉండటంతో వాటిని బయటకు పంపించడానికి లబుషేన్ తీవ్రంగా కష్టపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మెల్‌బోర్న్ పిచ్‌పై పరుగుల కోసం కంటే పావురాల కోసం ఆస్ట్రేలియా ఆటగాళ్లు కష్టపడుతున్నారని ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో లబుషేన్ (44), ట్రావిస్ హెడ్ (9) ఉన్నారు. పాకిస్థాన్ బౌలర్లలో హసన్ అలీ, ఆమర్ జమాల్, సాల్మన్ తలో వికెట్ తీశారు. కాగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా 360 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే పాకిస్థాన్ ఈ టెస్టులో తప్పకుండా గెలవాల్సి ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Dec 26 , 2023 | 08:04 PM