Indravelli: ఇంద్రవెల్లి ఘటనకు 42ఏళ్లు
ABN , First Publish Date - 2023-04-19T19:51:39+05:30 IST
ఇంద్రవెల్లి (Indravelli) ఘటనకు రేపటిక (గురువారం)తో సరిగ్గా 42ఏళ్లు. 1981, ఏప్రిల్ 20న భూమి కోసం.. భుక్తి కోసం.. విముక్తి కోసం..
ఆదిలాబాద్: ఇంద్రవెల్లి (Indravelli) ఘటనకు రేపటిక (గురువారం)తో సరిగ్గా 42ఏళ్లు. 1981, ఏప్రిల్ 20న భూమి కోసం.. భుక్తి కోసం.. విముక్తి కోసం.. మావనాటే - మావ రాజ్యం (మా ఊళ్లో మా రాజ్యం) అన్న నినాదంతో ఆదివాసీ రైతు కూలీ ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో పోలీసు బలగాలు ఉద్యమకారులపై తుపాకీ గుండ్ల వర్షం కురిపించాయి. ఈ ఘటనలో ఎందరో ఆదివాసీ గిరిజనులు అమరులయ్యారు. అప్పటి నుంచి ప్రతి యేటా ఏప్రిల్ 20న ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) ఇంద్రవెల్లి మండలం హిరాపూర్ గ్రామంలో నిర్మించిన అమరుల స్థూపం వద్ద అమరవీరులకు ఘన నివాళులర్పించడం ఆనవాయితీగా వస్తోంది. గత 42ఏళ్లుగా ఇంద్రవెల్లి ఘటన ఆదివాసీల గుండెల్లో మాయని గాయంగా మారింది. ఈ ఘటనలో కేవలం 13 మందే మరణించారని అప్పటి ప్రభుత్వం ప్రకటించినా.. ఎంతో మంది ఆదివాసీ గిరిజనుల ప్రాణాలు గాలిలో కలిశాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని అప్పట్లో అధికార పార్టీ నేతలు చెప్పిన మాటలు ఆచరణ సాధ్యం కావడం లేదు. తెలంగాణ ఏర్పడ్డాక కూడా అమరవీరులకు నివాళులర్పించేందుకు పరిమిత సంఖ్యలోనే పోలీసులు అనుమతులిస్తున్నారు. భారీ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదంటూ పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు. మరోవైపు.. ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పించేందుకు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఆదివాసీ సంఘాల నేతలు, ప్రజాసంఘాల నేతలు పెద్ద ఎత్తున తరలివస్తారు. అయితే మావోయిస్టుల కదలికలు ఉంటాయని భావిస్తున్న పోలీసులు.. ఈసారి గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 200మంది పోలీసు బలగాలతో అమరవీరుల స్థూపం, పరిసర ప్రాంతాలపై గట్టి నిఘా సారిస్తున్నారు.