Bandi Sanjay: సీఎం కేసీఆర్కు బండి సంజయ్ లేఖ.. పూర్తి వివరాలు ఇవే..
ABN , First Publish Date - 2023-04-26T19:12:27+05:30 IST
తెలంగాణ సీఎం కేసీఆర్కు (CM KCR) తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) లేఖ రాశారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్కు (CM KCR) తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) లేఖ రాశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీఎంకు బండి సంజయ్ కుమార్ లేఖలో పేర్కొన్నారు. యాసంగిలో రైతులు పంట నష్టపోవడం రెండోసారి అని, ఈ సీజన్లో 9 లక్షలకుపైగా ఎకరాల్లో పంట దెబ్బతిందని బండి సంజయ్ చెప్పారు. కౌలు రైతుల పరిస్థితి వర్ణణాతీతమని, ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారని ఎంపీ తెలిపారు. గత నెలలో ఇస్తానన్న రూ.228 కోట్ల పంట పరిహారం ఎందుకివ్వలేదు? అని బండి సంజయ్ ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ బాధ్యతారాహిత్యం కారణంగానే రాష్ట్రంలో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సకాలంలో తెరిచి ఉంటే, కనీసం 50 శాతం మంది రైతులు అకాల వర్షాల బారిన పడేవారు కాదని అన్నారు. గత నెలలో కురిసిన వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ. 10 వేల సాయం చేస్తామని ప్రకటించిన కేసీఆర్ ఇప్పటి వరకు నయాపైసా ఇవ్వలేదని ఆరోపించారు. సంజయ్ జిల్లా పార్టీ అధ్యక్షులు, కిసాన్ మోర్చా నేతలతో మంగళవారం టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వడగళ్ల వానతో రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొంటూ, ఆ నష్టం వివరాలు సేకరించాలని, బాధిత రైతులకు అండగా నిలవాలని అన్నారు.