Bandi Sanjay: బీజేపీ నేత సత్యకుమార్‌పై వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండించిన బండి సంజయ్
ABN, First Publish Date - 2023-03-31T20:11:51+05:30
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ (BJP National Secretary)పై వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా..
హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ (BJP National Secretary)పై వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) చెప్పారు. రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన సత్యకుమార్‌పై దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. రైతుల పట్ల వైసీపీ సర్కారు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్నారు. రైతు సమస్యలపై పోరాడుతున్న బీసీ, ఎస్టీ నేతలపై దాడులు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఏపీ సర్కారు స్పందించి దాడి చేసిన వారి అరెస్ట్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులను బీజేపీ సహించదని హెచ్చరించారు.
పధకం ప్రకారమే వైసీపీ (YCP) గూండాలు దాడి చేశారని బీజేపీ నేత సత్యకుమార్ (BJP leader Satya Kumar) ఆరోపించారు. తన కారును పోలీసులే ఆపారని.. ఎందుకు ఆపారని అడిగే లోపే తన వాహనంపై వైసీపీ (YCP) నేతలు, కార్యకర్తలు దాడి చేశారని సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కారుపై రాళ్ల దాడి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని, దాడిపై డీఎస్పీ సమాధానం చెప్పాలని బీజేపీ నేత సత్యకుమార్ డిమాండ్ చేశారు. జగన్‌రెడ్డి (JAGANREDDY) తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ఏపీలో వైసీపీ అరాచకానికి అడ్టుకట్ట వేస్తామని సత్యకుమార్ హెచ్చరించారు.
గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలంలోని మందడం దగ్గర బీజేపీ నేత సత్యకుమార్ వాహనాన్ని వైసీపీ గూండాలు అడ్డుకున్నాయి. బీజేపీ నేత సత్యకుమార్ కారుపై రాళ్లతో వైసీపీ గూండాలు దాడి చేశాయి. దీంతో వాహనాన్ని ఆపకుండా సత్యకుమార్ డ్రైవర్ ముందుకుపోనిచ్చారు. వైసీపీ కార్యకర్తల దాడిలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వైసీపీ గూండాల తీరుపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు. సీఎం జగన్‌రెడ్డి ఆదేశాలతోనే సత్యకుమార్ దాడి చేశారంటూ బీజేపీ కార్యకర్తల ఆందోళన చేస్తున్నారు.
1200వ రోజు అమరావతి ఉద్యమానికి బీజేపీ తరపున జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మద్దతు ప్రకటించారు. మందడం శిబిరం నుంచి తుళ్లూరు పార్టీ నేత పరామర్శకు సత్యకుమార్ వెళ్లారు. తిరిగి వస్తుండగా మందడం సమీపంలో 3 రాజధానుల శిబిరం దగ్గర సత్యకుమార్ వాహనాన్ని శిబిరంలోని వ్యక్తులు అడ్డుకున్నారు. సత్యకుమార్ కాన్వాయ్లోని కార్లపై వైసీపీ మూకలు రాళ్ల దాడి చేశాయి.
Updated Date - 2023-03-31T20:13:20+05:30 IST