BRS : గులాబీలో గుబులు!
ABN , First Publish Date - 2023-05-15T05:42:17+05:30 IST
పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఇక్కడి అధికార బీఆర్‌ఎస్‌పై ప్రభావం చూపనుందా? ముఖ్యంగా కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని రాష్ట్ర అసెంబ్లీ సీట్లపై ప్రభావం పడనుందా? కర్ణాటకలో
హైదరాబాద్–కర్ణాటక రీజియన్‌లో కాంగ్రెస్‌కు భారీగా సీట్ల్లు
● సరిహద్దు జిల్లాల్లో బీఆర్‌ఎస్‌కు ఇబ్బందులు తప్పవేమో!
హైదరాబాద్, మే 14 (ఆంధ్రజ్యోతి): పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఇక్కడి అధికార బీఆర్‌ఎస్‌పై ప్రభావం చూపనుందా? ముఖ్యంగా కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని రాష్ట్ర అసెంబ్లీ సీట్లపై ప్రభావం పడనుందా? కర్ణాటకలో జేడీఎస్ ఓటమి చవిచూడటం బీఆర్‌ఎస్‌కు ఇబ్బందికరంగా మారనుందా? అంటే... అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కర్ణాటక ఎన్నికల తాజా ఫలితాల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌పై రకరకాల అంచనాలు వేస్తున్నారు. త్వరలో తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కర్ణాటక ఎన్నికల ప్రభావం తప్పకుండా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. పైగా బీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేసిన తర్వాత కర్ణాటకతోనే సీఎం కేసీఆర్ ఎక్కువగా సంబంధ బాంధవ్యాలను నెరిపినందున ఆ ప్రభావం నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని చెబుతున్నారు. కర్ణాటక విజయం ఇచ్చిన కిక్కుతో తెలంగాణలో కాంగ్రెస్ మరింత బలపడి బీఆర్‌ఎస్‌కు కొరకరాని కొయ్యగా మారవచ్చునని వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించడం బీఆర్‌ఎస్‌కు దెబ్బేనని అంటున్నారు. నిజానికి కర్ణాటకలో అధికార బీజేపీకి ఓటమి తప్పదని, కాంగ్రెస్ విజయం సాధించనుందంటూ విశ్లేషణలొచ్చాయి. ఈ నెల 10న ఎన్నికలు జరిగిన తర్వాత చాలా సంస్థల ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్‌దే ఆధిక్యమంటూ వెల్లడించాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి కాంగ్రెస్ అద్భుత విజయం సాధించింది. మొత్తం 224 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ 135 సీట్లలో విజయ కేతనాన్ని ఎగురవేసింది. తెలంగాణతో సరిహద్దును కలిగి ఉన్న ‘హైదరాబాద్–కర్ణాటక’ రీజియన్‌లోని 41 సీట్లలో 26 సీట్లను కాంగ్రెస్ పార్టీయే గెలుచుకుంది. కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ బొక్కబోర్లా పడింది. ఇది బీఆర్‌ఎస్‌కు పెద్ద షాకేనని చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చాక ఇతర రాష్ట్రాలకు చెందిన నేతల్లో జేడీఎస్ నేత కుమారస్వామియే తొలుత కేసీఆర్‌ను కలిశారు. ఆయన నాలుగైదుసార్లు కేసీఆర్‌ను కలవడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. కుమారస్వామికి కేసీఆర్ ఆర్థిక సాయం కూడా చేశారన్న ప్రచారం జరిగింది. దాంతో బీఆర్‌ఎస్, జేడీఎస్ కలిసే కర్ణాటకలో పోటీ చేస్తాయన్న వార్తలొచ్చాయి. కర్ణాటకలో జేడీఎస్ గెలిస్తే అక్కడ కుమారస్వామి ద్వారా చక్రం తిప్పవచ్చునని కేసీఆర్ భావించారు. ఒకవేళ కాంగ్రెస్‌కు గానీ బీజేపీకి గానీ పూర్తిస్థాయి మెజారిటీ రాకపోతే... జేడీఎస్ ద్వారా రాజకీయాన్ని నడపవచ్చుననుకున్నారు. ఒకదశలో కర్ణాటకతో పాటే మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలనీ యోచించారు. లేదంటే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఆ ప్రభావం తెలంగాణలో ఉంటుందన్న భయాందోళనలు అప్పుడే వ్యక్తమయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అందులో ఎక్కువగా నష్టపోయేది తెలంగాణలోని బీఆర్‌ఎస్ పార్టీయేనని అంచనా వేశారు. ఇప్పుడదే జరిగింది. కర్ణాటకలో అందునా... హైదరాబాద్–కర్ణాటక రీజియన్‌లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లను గెలుచుకుంది. ఈ రీజియన్‌లోని బీదర్, యాద్గిర్, రాయ్‌చూర్, గుల్బర్గా, కొప్పల్ తదితర ప్రాంతాల్లోని ప్రజలకు తెలంగాణ ప్రజలకు మధ్య బంధుత్వాలు, చుట్టరికాలున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువ రాకపోకలు సాగుతుంటాయి. అక్కడి సరిహద్దు ప్రాంతాల్లో తెలుగువారు, ఇక్కడి సరిహద్దు నియోజకవర్గాల్లో కర్ణాటక ప్రజలు నివసిస్తున్నారు.
వీరు రానున్న తెలంగాణ ఎన్నికల్లో కీలకం కానున్నారు. అక్కడి సరిహద్దు ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో, ఇక్కడి సరిహద్దు ఓటర్లు కాంగ్రెస్‌నే నమ్ముకోవచ్చన్న చర్చ జరుగుతోంది. బంధువుల రాకపోకల వల్ల ఈ ప్రభావం పడుతుందని అంటున్నారు. ఇది బీఆర్‌ఎస్‌ను ఊహించని దెబ్బ కొడుతుందన్న అభిప్రాయాలున్నాయి. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దు జిల్లాలైన సంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాలతో పాటు బాన్సువాడ వంటి ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌పై ప్రభావం ఉంటుందన్న అభిప్రాయాలున్నాయి. అంతేకాదు... కేసీఆర్‌ను నమ్మి దోస్తీ చేసిన జేడీఎస్‌కు అక్కడి ప్రజలు చేదు అనుభవాన్ని మిగిల్చారు. ఆ మేరకు తెలంగాణలోనూ కేసీఆర్ సారధ్యంలోని బీఆర్‌ఎస్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చుననే అభిప్రాయాలున్నాయి. పైగా కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ ఇచ్చిందన్న సానుభూతి, అభిమానం ఇక్కడి ప్రజల్లో ఉండనే ఉంది. ఇదే అభిమానం రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కలిసి వస్తుందన్న అభిప్రాయాలున్నాయి. దానికితోడు కర్ణాటకలో గెలిచిన ఊపుమీదున్న కాంగ్రెస్, తెలంగాణలోనూ మరింత పుంజుకోవచ్చునని చెబుతున్నారు. ఇప్పటికే రకరకాల ఉద్యమాలు సాగిస్తున్న పార్టీ నేతలు... మున్ముందు కదనోత్సాహంతో ముందుకు సాగుతారని, ఆ మేరకు బీఆర్‌ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ కాంగ్రెస్‌కే పడొచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.