KCR: వరాలతో సరి!
ABN, First Publish Date - 2023-02-10T02:31:28+05:30
ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్నాళ్లుగా ఏ జిల్లా పర్యటనకు వెళితే ఆ జిల్లాపై హామీల వర్షం కురిపిస్తున్నారు. ప్రజలు అడిగినా, అడగకపోయినా.. అదే పనిగా వాగ్దానాలు, రూ.లక్షలు, కోట్ల విలువైన పనుల ప్రకటనలు చేస్తున్నారు.
జిల్లాల పర్యటనల్లో ముఖ్యమంత్రి భారీ హామీలు
కలెక్టరేట్ల ప్రారంభోత్సవాల్లో వాగ్దానాలు
ఎస్‌డీఎఫ్ కింద నిధుల మంజూరుకు చర్యలు
నెరవేరినవి కొన్నే... నెరవేరనివి ఎన్నో
ఎప్పుడు అమలవుతాయోనని ప్రజల నిరీక్షణ
ఇప్పటికి 17 జిల్లాల కలెక్టరేట్ల ప్రారంభం
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్నాళ్లుగా ఏ జిల్లా పర్యటనకు వెళితే ఆ జిల్లాపై హామీల వర్షం కురిపిస్తున్నారు. ప్రజలు అడిగినా, అడగకపోయినా.. అదే పనిగా వాగ్దానాలు, రూ.లక్షలు, కోట్ల విలువైన పనుల ప్రకటనలు చేస్తున్నారు. ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు, ఒక్కో నియోజకవర్గానికి రూ.10 కోట్లు, ఒక్కో మునిసిపాలిటీకి రూ.30 కోట్లు, కార్పొరేషన్‌కు రూ.40 కోట్ల అంటూ హామీలిస్తున్నారు. దీంతో కలెక్టరేట్ల ప్రారంభోత్సవాలు ఉన్నాయంటే చాలు.. తమ జిల్లాపై వరాల జల్లు కురుస్తుందని అక్కడి ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆశపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. కానీ, ఈ హామీల్లో చాలా వరకు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి తప్ప.. అమలుకు నోచుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఒక్కో జిల్లాలో ఒకటి రెండు హామీలు మాత్రమే అమలవుతున్నాయని, కొన్నింటికి నిధులు మంజూరైనా పనులు చేపట్టడం లేదని అంటున్నారు. ఇంకా కొన్నింటికి ప్రజాప్రతినిధులు సరైన ప్రతిపాదనలు సిద్ధం చేయడం లేదని చెబుతున్నారు. దీంతో సీఎం హామీలకే దిక్కు లేకపోతే.. మంత్రులు ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గత ఏడాది డిసెంబరు 4న మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల అభివృద్ధికి ఇప్పుడిస్తున్న నిధులకు అదనంగా ఒక్కో నియోజకవర్గానికి రూ.15 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. ప్రతి నియోజకవర్గానికి అదనంగా మరో 1000 డబుల్ బెడ్‌రూం ఇళ్లను, ప్రతి నియోజకకర్గంలో సొంత ఇళ్ల స్థలాలున్నవారికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. పాలమూరు ప్రాజెక్టులోని కరివెన రిజర్వాయర్ నుంచి మక్తల్- నారాయణపేట కాల్వ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. కానీ, ఇందులో ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. రాజన్న-సిరిసిల్ల కలెక్టరేట్‌ను 2021 జూలై 4న కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్కపేట రిజర్వాయర్‌లోకి మిడ్‌మానేరు నీటిని ఎత్తిపోస్తామని, అంతగిరి ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరు వరకు పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామంటూ ఇచ్చిన హామీలు నెరవేరలేదు. కాళేశ్వరం జలాలు మిడ్ మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు తరలివెళ్లినా మల్కపేట రిజర్వాయర్ పనులు వేగం పుంజుకోలేదు.
సీఎం హామీల్లో నెరవేరని ఇవీ..
గత ఏడాది ఆగస్టు 29న పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని సీఎం ప్రారంభించిన సందర్భంగా ఆ జిల్లాలోని ఒక కార్పొరేషన్, మూడు మునిసిపాలిటీలకు రూ.కోటి చొప్పున రూ.4 కోట్లు, 266 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున రూ.26.60 కోట్లు.. మొత్తం రూ.30.6 కోట్లను ఇస్తున్నట్లు ప్రకటించారు. కానీ, మునిసిపాలిటీలు, 4 మండలాల నుంచి ఇంకా ప్రతిపాదనలు జిల్లా అధికారులకు అందనేలేదు.
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను 2021 జూన్ 20న ప్రారంభించిన సందర్భంగా సీఎం ఇచ్చిన హామీల్లో.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని 22వ ప్యాకేజీ పనులను ఏడాదిలో పూర్తి చేస్తామన్న హామీ నెరవేరలేదు. కామారెడ్డి నియోజకవర్గంలో 33 కేవీ సబ్‌స్టేషన్లు, పట్టణంలో ట్రాఫిక్ పోలీ్‌సస్టేషన్, రూరల్ పోలీ్‌సస్టేషన్ అప్‌గ్రేడేషన్ హామీలు కూడా ఇంకా అమలు కాలేదు.
యాదాద్రి-భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ను గతేడాది ఫిబ్రవరి 12న కేసీఆర్ ప్రారంభించారు. జిల్లాలోని బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్లను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. బునాదిగాని కాలువ, ధర్మారెడ్డి కాలువ, పిల్లాయిపల్లి కాలువలను పూర్తి చేసి సాగునీటిని అందిస్తామని చెప్పారు. కానీ, నిధుల మంజూరులో జాప్యం జరుగుతోంది.
గతేడాది ఆగస్టు 17న మేడ్చల్ కలెక్టరేట్‌ను ప్రారంభిస్తూ ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.10 కోట్ల వంతున జిల్లాకు మొత్తం రూ.70 కోట్లు మంజూరు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఎమ్మెల్యేలు ప్రతిపాదనలను రూపొందించే పనిలో ఉన్నారు. ఎన్ని నిధులు వస్తాయో వేచి చూడాలి.
హనుమకొండ కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా వరంగల్‌లోని సెంట్రల్ జైలు స్థానంలో 33 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామన్నారు. ఇప్పటివరకు 6 అంతస్తులే పూర్తయ్యాయి. ఇతర పనులు మందకొడిగా సాగుతున్నాయి. కాగా, మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను పునరుద్ధరిస్తామన్నా.. పనులు సాగడం లేదు. వరంగల్‌కు డెంటల్ కాలేజీ, డెంటల్ ఆస్పత్రి మంజూరు చేస్తామని ప్రకటించినా.. నిధులు రాలేదు.
జనగామ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాన్ని గతేడాది ఫిబ్రవరి 11న కేసీఆర్ ప్రారంభించారు. జిల్లా కేంద్రానికి మెడికల్ కాలేజీ, స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గ కేంద్రాలకు డిగ్రీ కాలేజీలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మెడికల్ కాలేజీ నెలరోజుల్లోనూ మంజూరైంది. కానీ, డిగ్రీ కాలేజీలు ఇంకా మంజూరు కాలేదు.
నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్‌ను గత ఏడాది సెప్టెంబరు 5న సీఎం ప్రారంభించారు. నిజామాబాద్ నగర కార్పొరేషన్ అభివృద్ధికి రూ.100 కోట్లు, ప్రతి నియోజకవర్గానికి అదనంగా రూ.10 కోట్ల చొప్పున ప్రకటించారు. రూ.100 కోట్ల జీవో మాత్రమే విడుదలైంది. పాత కలెక్టరేట్ ఆవరణలో కళాభారతి నిర్మిస్తామని చెప్పినా.. ఇప్పటికీ నిర్మాణం మొదలు పెట్టలేదు.
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను గతేడాది ఆగస్టు 26న కొంగరకలాన్‌లో కేసీఆర్ ప్రారంభించారు. ఆ సందర్భంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. వీటికి సంబంధించి జీవో జారీ అయింది. కొంత మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు పంపగా.. ఇంకా కొంత మంది పంపలేదు.
వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌ను గతేడాది ఆగస్టు 16న కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున మొత్తం రూ.40 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటికి ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు.
సిద్దిపేట కలెక్టరేట్‌ను 2021 జూన్ 20 కేసీఆర్ ప్రారంభించారు. జిల్లాలో వెటర్నరీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం 30 ఎకరాలు కేటాయించారు. ఇంకా పనులు ప్రారంభం కాలేదు. వీటితోపాటు ఈ ఏడాది జనవరి 18న ఖమ్మం కొత్త కలెక్టరేట్‌ను, జనవరి 12న భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ భవన సముదాయాన్ని, 2022 డిసెంబరు 7న జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా కూడా ముఖ్యమంత్రి ఆయా జిల్లాలపై హామీల వర్షం కురిపించారు. అవన్నీ అమల్లోకి రావాల్సి ఉంది.
ఎస్‌డీఎఫ్ కింద నిధులిచ్చే అవకాశం
కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత హైదరాబాద్, సంగారెడ్డి, నల్లగొండ మినహా మిగతా అన్ని జిల్లాలకు సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం రూ.1581.62 కోట్ల వ్యయ అంచనాలతో పనులు చేపట్టగా.. ఇప్పటివరకు రూ.1008.53 కోట్లను వ్యయం చేశారు. ఇప్పటికి 17 కలెక్టరేట్ల భవనాలు పూర్తయ్యాయి. మరో 11 భవనాల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. నిర్మాణం పూర్తయిన 17 కలెక్టరేట్ల భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఏ జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తే ఆ జిల్లాకు వరాల జల్లు కురిపించారు. స్థానిక మంత్రి, ఎమ్మెల్యేలు కోరిందే తడవుగా వాగ్దానాలు చేశారు. కానీ, ఈ హామీల్లో చాలావాటికి నిధులు మంజూరు కాలేదు. కొన్నింటికి నిధులు మంజూరైనా పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రజల్లో అసహనం నెలకొంటోంది. నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటికప్పుడు ఇచ్చే హామీలను నెరవేర్చడానికే తన వద్ద స్పెషల్ డెవల్‌పమెంట్ ఫండ్(ఎ్‌సడీఎ్‌ఫ)ను పెట్టుకున్నారు. ఇందుకోసం 2022-23 బడ్జెట్‌లో రూ.2000 కోట్లు కేటాయించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023-24కు)గాను దీనికి ఏకంగా రూ.10 వేల కోట్లకు పెంచారు. అయితే నిధులు అందుబాటులో ఉన్నా.. ఇప్పటివరకు కొన్ని పనులకు మంజూరు చేయడం లేదన్న విమర్శలున్నాయి. చాలా పనులకు ఇంకా జీవోలు వెలువడడం లేదని చెబుతున్నారు.
Updated Date - 2023-02-10T03:16:15+05:30 IST