Jupalli Krishnarao: కేసీఆర్ పాలన చూస్తే బాదేస్తోంది... ఇలాంటి మనిషి ఎక్కడా లేరు

ABN , First Publish Date - 2023-08-03T12:24:07+05:30 IST

తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలన చూస్తే చాలా బాధ కలుగుతోందని కాంగ్రెస్ నేత జూపల్లి కృష్ణారావు అన్నారు.

Jupalli Krishnarao: కేసీఆర్ పాలన చూస్తే బాదేస్తోంది... ఇలాంటి మనిషి ఎక్కడా లేరు

న్యూఢిల్లీ: తొమ్మిదేళ్ల కేసీఆర్(CM KCR) పాలన చూస్తే చాలా బాధ కలుగుతోందని కాంగ్రెస్ నేత జూపల్లి కృష్ణారావు (Congress Leader Jupalli Krishna rao) అన్నారు. ఈరోజు (గురువారం) ఉదయం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే (AICC Chief Mallikarjuna Kharge) సమక్షంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. వందలాది మంది ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్న రాష్ట్రమేనా ఇది అనిపిస్తుందన్నారు. దుర్మార్గ, అవినీతి, అహంకారపూరిత మనిషి (కేసీఆర్) ఎక్కడా లేరన్నారు. ఇంతటి అవినీతి బహుశా ప్రపంచంలో ఎక్కడా లేదని తెలిపారు. రాక్షస మనస్తత్వం కేసీఆర్ ది అని.. నాడు ఉద్యమ సమయంలో లక్షకు గతి లేదని... ఇప్పుడు ఎన్నికల్లో ఓట్లకు లక్షలు, కోట్లు ఖర్చు చేస్తున్నారని... ఇవన్నీ ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిపోయిందన్నారు. తొమ్మిదేళ్లలో ఒక్కసారి కూడా సచివాలయం వెళ్ళని సీఎం దేశ చరిత్రలో ఎక్కడైనా ఉన్నారా? అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇబ్బందులు ఉన్నా సరే, పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారన్నారు. రాబోయే ఎన్నికల్లో నూటికి నూరుపాళ్లు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి సోనియా రుణం తీర్చుకోవాలని తెలిపారు. కర్ణాటకలో అవినీతి బీజేపీ సర్కారును ఓడించిన మాదిరిగా... అంతకు మించి అవినీతిలో కూరుకున్న కేసీఆర్ సర్కారును కూడా ఒడించాలని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

Updated Date - 2023-08-03T12:24:07+05:30 IST