Dr. Venkatarao: పునరాలోచనలో డాక్టర్‌ తెల్లం.. తనకు ఎమ్మెల్యే టికెట్‌ కావాల్సిందేనంటూ పట్టు?

ABN , First Publish Date - 2023-08-16T12:11:36+05:30 IST

‘వైద్యవృత్తిలో ఉన్న నేను పదిహేనేళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నా.. నాకు బీఆర్‌ఎస్‌ భద్రాచలం అభ్యర్థిగా టికెట్టు వస్తుందని తెలిసి కూడా

Dr. Venkatarao: పునరాలోచనలో డాక్టర్‌ తెల్లం.. తనకు ఎమ్మెల్యే టికెట్‌ కావాల్సిందేనంటూ పట్టు?

- స్పందించకపోతే సొంతగూటికి వెళ్లే యోచనలో ఉన్నట్టు ప్రచారం

భద్రాచలం(భద్రాద్రి కొత్తగూడెం): ‘వైద్యవృత్తిలో ఉన్న నేను పదిహేనేళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నా.. నాకు బీఆర్‌ఎస్‌ భద్రాచలం అభ్యర్థిగా టికెట్టు వస్తుందని తెలిసి కూడా మా నాయకుడిని నమ్మి ఆయన వెంట నడిచా.. అలాంటి నాకు వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా సీటు కేటాయించాలి’ అంటూ డాక్టర్‌ తెల్లం వెంకట్రావు(Dr. Tellam Venkatarao) కాంగ్రెస్‌ అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. భద్రాచలానికి చెందిన తెల్లం వెంకట్రావు బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ బాధ్యుడిగా ఉన్నప్పటికీ తమ నాయకుడైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Former MP Ponguleti Srinivasa Reddy)తో కలిసి గత నెల 2న ఖమ్మంలో జరిగిన సభలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ క్రమంలో పొంగులేటి వర్గం నుంచి తనకు వచ్చే ఎన్ని కల్లో భద్రాచలం అసెంబ్లీ టికెట్‌ దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. ఇటీవల ఆయన సోదరి దుమ్ముగూడెం జడ్పీటీసీ సభ్యురాలు తెల్లం సీతమ్మతో పాటు పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ నాయకులు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అయితే ప్రస్తుతం భద్రాచలం ఎమ్మెల్యేగా డీసీసీ అధ్యక్షుడు, పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు పొదెం వీరయ్య(Podem Veeraya) ఉన్న క్రమంలో తనకు భద్రాచలం టికెట్‌ దక్కుతుందోలేదోనన్న భావిస్తున్న వెంకట్రావు.. పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారని, ఒక వేళ భద్రాచలం సాధ్యం కాకపోతే ఇతర ఏ నియోజకవర్గం నుంచైనా అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టు తెలుస్తోంది.

ఒకవేళ పార్టీ అందుకు సానుకూలంగా స్పందించకపోతే అవసరమైతే సొంతగూటికి వెళ్లేందుకు కూడా సిద్ధమవు తున్నారని, ఈ మేరకు ఇప్పటికే అధికార పార్టీ నాయకుల నుంచి కూడా ప్రతిపాదన వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. తెల్లం వెంకట్రావు కూడా ఇదే దిశగా సంకేతాలిస్తున్నట్లు తెలుస్తోంది. 2014లో తొలిసారిగా మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన తెల్లం వెంకట్రావు ఓటమిపాలయ్యారు. అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరి 2018లో జరిగిన ఎన్నికల్లో భద్రాచలం నుంచి పోటీ చేసి ప్రస్తుత కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పొదెం వీరయ్యపై ఓటమి చెందారు. ఈసారి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మరోసారి బరిలో దిగుతారని భావించిన సమయంలో తమ నాయకుడు పొంగులేటి వెంట కాంగ్రెస్‌లో చేరడంతో ఆయన భవితవ్యం గందరగోళంగా మారింది. సిటింగ్‌ ఎమ్మెల్యేను కాదని కాంగ్రెస్‌ తెల్లం వెంకట్రావుకు అభ్యర్థిత్వం ఇస్తుందా లేదా అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో తెల్లం వెంకట్రావు తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. ఒకవేళ ఏ పార్టీ తనకు టికెట్‌ ఇవ్వకపోతే రాజకీ యాల నుంచి శాశ్వతంగా నిష్క్రమించి వైద్యవృత్తిని కొనసాగిస్తానని వెంక ట్రావు తన ఆత్మీయుల వద్ద పేర్కొంటున్నట్లు సమాచారం.

Updated Date - 2023-08-16T12:11:36+05:30 IST