Housing close: హౌసింగ్‌ క్లోజ్‌!

ABN , First Publish Date - 2023-01-21T02:18:21+05:30 IST

ఒకప్పుడు లక్షల మందికి ఓ గూడు కల్పించిన శాఖ అది! ఇందిరమ్మ, రాజీవ్‌ స్వగృహ తదితర పథకాల పేరిట పెద్దఎత్తున పక్కా ఇళ్లను నిర్మించిన విభాగం!

Housing close: హౌసింగ్‌ క్లోజ్‌!

రాష్ట్రంలో గృహ నిర్మాణ శాఖ మూసివేత

ఆర్‌అండ్‌బీలో విలీనం చేస్తూ నిర్ణయం.. ఆస్తులు, అప్పులు, సిబ్బంది కూడా బదిలీ

కొత్తగా ఏ కార్యక్రమాలూ లేనందునే.. ఇక హౌసింగ్‌ వ్యవహారాలన్నీ ఆర్‌అండ్‌బీకి

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మిగిలిన పనుల పూర్తికి ప్రత్యేక విభాగం

ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హౌసింగ్‌ శాఖ.. ఇకపై కనుమరుగు

హైదరాబాద్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు లక్షల మందికి ఓ గూడు కల్పించిన శాఖ అది! ఇందిరమ్మ, రాజీవ్‌ స్వగృహ తదితర పథకాల పేరిట పెద్దఎత్తున పక్కా ఇళ్లను నిర్మించిన విభాగం! ఇప్పుడు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తున్న శాఖ! ఏ ఊరికి వెళ్లినా తప్పనిసరిగా ఓ శిలా ఫలకం కనిపించే గృహ నిర్మాణ శాఖ ఇప్పుడు చరిత్రలో కలిసిపోయింది. ఆ శాఖను మూసివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిని రోడ్లు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ)లో విలీనం చేసింది. గృహ నిర్మాణ శాఖకు చెందిన ఆస్తులు, అప్పులతోపాటు సిబ్బంది, నిర్మాణంలో ఉన్న ఇళ్లు తదితర ఇతర వ్యవహారాలనూ ఆర్‌అండ్‌బీకి అప్పగించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం గృహ నిర్మాణ శాఖలో కొత్తగా ఎటువంటి కొత్త కార్యక్రమాలూ లేవని, బలహీన వర్గాల గృహ నిర్మాణాలను కూడా ఇతర శాఖలు చేపడుతున్నాయని, అందుకే ఆ శాఖను మూసి వేయాలని నిర్ణయించామని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ శాఖలో భాగమైన హౌసింగ్‌ బోర్డ్‌, రాజీవ్‌ స్వగృహ, దక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (దిల్‌) ఆధ్వర్యంలోనూ ఎలాంటి కార్యక్రమాలు లేవని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బీతోపాటు హౌసింగ్‌ డిపార్ట్‌మెంట్లకు చీఫ్‌ సెక్రటరీ శాంతికుమారి నిర్దేశించారు. మిగిలిపోయిన పనులను నిర్వహించేందుకు ఆర్‌అండ్‌బీలో తాత్కాలికంగా ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపారు.

గతమెంతో ఘనం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1979లో గృహ నిర్మాణ శాఖ పేరుతో అప్పటి ప్రభుత్వం దీనిని ప్రారంభించింది. 1977లో వచ్చిన తీవ్రమైన తుపాను ధాటికి తీర ప్రాంతంలోని రెండు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. తుపాను బాధితులకు పక్కా ఇళ్లను నిర్మించేందుకు అప్పట్లో ఈ శాఖను ఏర్పాటు చేశారు. అనంతరం, అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్‌ ప్రభుత్వం పేదలకు పక్కా గృహ నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చింది. అప్పటి నుంచి పేదలకు అవసరమైన గృహ నిర్మాణాలను ఈ శాఖ ఆధ్వర్యంలోనే నిర్మించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనూ ఇందిరమ్మ, రాజీవ్‌ స్వగృహ ఇళ్లను ఈ శాఖ పర్యవేక్షణలో నిర్మించారు. టీడీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఈ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా లక్షల సంఖ్యలోనే పక్కా ఇళ్లను నిర్మించారు. కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీ, ఎస్‌ఆర్‌ నగర్‌లోని కొన్ని ఇళ్లను కూడా హౌసింగ్‌ డిపార్ట్‌మెంటే నిర్మించింది. కేంద్రం మంజూరు చేసే ఆవాసాలను కూడా ఈ శాఖే నిర్మించింది. ఇక, ఉమ్మడి ఏపీలో ల్యాండ్‌ బ్యాంక్‌ కోసం దక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (దిల్‌) కింద జిల్లాల్లో భూములను సేకరించారు. ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను కూడా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలోనే నిర్మిస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో 1979 తర్వాత ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ముందుగా పేదలకు గూడు కల్పించడంపైనే దృష్టిసారించేది. ప్రతి ప్రభుత్వం పెద్దఎత్తున ఇళ్లను మంజూరు చేసేది. తొలి రోజుల్లో వేల సంఖ్యలో ఆ తర్వాత ఏటా లక్షల సంఖ్యలోనే ఇళ్లను పూర్తి చేసేది. వీటి నిర్మాణం గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలోనే జరిగేది. అంతటి ప్రాశస్త్యం కలిగిన గృహ నిర్మాణ శాఖ చేపట్టేందుకు ఇప్పుడు కొత్తగా ఎలాంటి కార్యక్రమాలు లేవన్న కారణంగా తెలంగాణ సర్కారు స్వస్తి పలికింది. కాగా, సచివాలయం, సమీకృత జిల్లా కలెక్టర్‌ కార్యాలయాలు, మెడికల్‌ కాలేజీలు, హైదరాబాద్‌, వరంగల్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు వంటి భారీ ప్రాజెక్టులు ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో సాగుతున్నాయి. తాజాగా డబుల్‌ బెడ్‌ రూం వంటి మరో భారీ ప్రాజెక్టునూ ఆ శాఖ చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే డబుల్‌ ఇళ్లు నత్తనడకన సాగుతున్నాయి. వాటి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో, ఇప్పటికే పనిభారంతో ఉన్న ఆర్‌అండ్‌బీ అధికారులు విలీనమైన హౌసింగ్‌పై ఎంతమేర దృష్టి సారిస్తారన్నది ప్రశ్నార్థకమే. అలాగే, కాంగ్రెస్‌ హయాంలో పలు జిల్లాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు ఇప్పటికీ నిరుపయోగంగా ఉన్నాయి. ‘దిల్‌’ కింద హైదరాబాద్‌లోని ప్రఽధాన ప్రాంతాల్లో వందల కోట్ల విలువ చేసే స్థలాలున్నాయి. ప్రస్తుతం ఇవన్నీ లీజులో ఉండగా విలీనంతో వీటి లీజు వ్యవహారాలు, పర్యవేక్షణ బాధ్యత ఆర్‌అండ్‌బీలో తాత్కాలికంగా ఏర్పాటు చేసే ప్రత్యేక విభాగం చేతికి వెళతాయి.

Updated Date - 2023-01-21T03:31:54+05:30 IST