Hyderabad: ‘కరోనా’ చికిత్సకు చెస్ట్ ఆస్పత్రిలో 20 పడకలు
ABN , Publish Date - Dec 20 , 2023 | 12:58 PM
తెలంగాణలో కొవిడ్ మరోసారి విజృంభిస్తే సమర్థవంతంగా ఎదుర్కొంటామని ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్‌ఖాన్(Dr. Mahaboob Khan) తెలిపారు.
- అవసరాన్ని బట్టి పెంపు
- చెస్ట్ ఆస్పత్రి సూపరింటెండెంట్ మహబూబ్‌ఖాన్
ఎర్రగడ్డ(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కొవిడ్ మరోసారి విజృంభిస్తే సమర్థవంతంగా ఎదుర్కొంటామని ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్‌ఖాన్(Dr. Mahaboob Khan) తెలిపారు. ముందస్తుగా అందుకు తగ్గట్లుగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం ఆస్పత్రిలోని వైద్యులు, సిబ్బందితో ఆయన ప్రత్యేక అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోగులకు కావలసిన అన్ని ఏర్పాట్లను ఇక్కడ పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. చాతి ఆస్పత్రిలో కొవిడ్‌కు సంబంధించి ప్రస్తుతానికి 20 పడకలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇందులో 10పడకలు మగవారికి, మరో 10 ఆడవారికి కెటాయిస్తున్నట్లు తెలిపారు. అవసరాన్ని బట్టి ఈ వీటిని పెంచడానికి చర్యలు తీసుకుంటామన్నారు. గర్భిణీ మహిళలకు ఇక్కడ చికిత్సలు చేయడం లేదని, వారిని గాంధీ తదితర ఆస్పత్రులకు తరలించనున్నట్లు తెలిపారు. రెండు ఆర్‌ఏసీ వార్డులు ఉన్నాయని, ఒకటి సాధారణ శ్వాసకోశ వ్యాధుల రోగులకు, మరొకటి కొవిడ్ రోగులకు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఒకేసారి శ్వాసకోశ వ్యాధుల రోగులు, కొవిడ్ రోగులు రావడం జరిగిందని అలాంటి సమయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నామని అన్నారు. నిత్యం వచ్చే శ్వాసకోశ వ్యాధిగ్రస్తులకు 280 బెడ్లు నిరంతరం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కాగా కొవిడ్, సాధారణ రోగులకు సేవలు అందించేందుకు 60మంది వైద్యులు, 120మంది నర్సులు, 400 మంది వరకు ఇతర సిబ్బంది ఉన్నారన్నారు. పర్సనల్ ప్రొటెక్షన్ కిట్లు, ఆర్టిపీసీఆర్ కిట్లు, మందులు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు తదితర వైద్య పరికరాలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లను పూర్తిచేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ నరేందర్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.