BJP Protest: బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు బీజేపీ పిలుపు
ABN , First Publish Date - 2023-04-05T10:22:59+05:30 IST
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శనలకు తెలంగాణ బీజేపీ పిలుపునిచ్చింది.
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ (BJP Leader Bandi Sanjay Arrest) అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శనలకు తెలంగాణ బీజేపీ (Telangana BKP)పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబంపై లీకేజీ ప్యాకేజీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళుతుండటంతోనే.. దాన్ని పక్కదారి పట్టించడానికి బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి ఇప్పుడు కారణాలు వెతుకుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతూ సంజయ్‌ను బేషరత్‌గా విడుదల చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఆందోళనలు.. అరెస్ట్‌లు..
బీజేపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న కమలం పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి తుల ఆంజనేయులు, సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బండి సంజయ్ అరెస్టు నేపథ్యంలో ఆందోళనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా ముందస్తు అరెస్టులు జరుగుతున్నాయి.
ఆదిలాబాద్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
హనుమకొండలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మను హౌస్ అరెస్ట్ చేశారు. పద్మ ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. హనుమకొండ పోలీస్ స్టేషన్‌లో బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు ఉన్నారు. రాత్రి నుంచి బీజేపీ నాయకులు పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు భైంసా, ముథోల్, ఖానాపూర్‌లో బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.