Bandi Sanjay: ‘అంబేడ్కర్ విగ్రహానికి బీజేపీ వ్యతిరేకం కాదు.. పక్కా స్వాగతిస్తాం’

ABN , First Publish Date - 2023-04-14T12:21:29+05:30 IST

అంబేడ్కర్ విగ్రహానికి బీజేపీ వ్యతిరేకం కాదని.. పక్కా స్వాగతిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పష్టం చేశారు.

Bandi Sanjay: ‘అంబేడ్కర్ విగ్రహానికి బీజేపీ వ్యతిరేకం కాదు.. పక్కా స్వాగతిస్తాం’

హైదరాబాద్: అంబేడ్కర్ విగ్రహానికి (Ambedkar Statue) బీజేపీ వ్యతిరేకం కాదని.. పక్కా స్వాగతిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay) స్పష్టం చేశారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో (BJP Office) అంబేడ్కర్‌ 132వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొప్పు భాషా, బంగారు శృతి, మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్, చింతా సాంబమూర్తి తదితరులు అంబేడ్కర్‌కు నివాళులర్పించారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. దళితద్రోహి‌ కేసీఆర్‌కు అంబేడ్కర్‌ విగ్రహం ఆవిష్కరించే అర్హత లేదన్నారు. దళిత సమాజానికి క్షమాపణ చెప్పిన తర్వాతనే కేసీఆర్ (CM KCR) అంబేద్కర్ విగ్రహాన్ని ముట్టుకోవాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ (Telangana CM) దళితులను అన్ని విధాలా మోసం చేశారని విమర్శించారు. బీజేపీ ఒత్తిడి వలనే నిలిచిన అంబేడ్కర్ విగ్రహం పనులను ప్రభుత్వం తిరిగి ప్రారంభించిందని ఆయన చెప్పుకొచ్చారు.

సచివాలయం పనులను పదే పదే పర్యవేక్షించిన కేసీఆర్.. అంబేడ్కర్‌ విగ్రహం పనులను ఒక్కసారి కూడా పరిశీలించలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్రాహ్మణుల‌ ఓట్ల కోసమే పీవీ శత జయంతి ఉత్సావాలు నిర్వహించారని వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు అయిపోతే అంబేడ్కర్‌‌ను కేసీఆర్ స్మరించడని దళిత సమాజం గుర్తుంచుకోవాలన్నారు. ఆరోగ్యశ్రీ నిధులు ఆపేయటం వలన దళితులే ఎక్కువ నష్టపోతున్నారని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో అంబేడ్కర్‌‌ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్‌ది అని చెప్పుకొచ్చారు. 317 ఆర్టికల్, దేశవిభజనను వ్యతిరేకించటం వలనే కాంగ్రెస్ అంబేద్కర్‌ను ఓడించిందని తెలిపారు. అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వటానికి వాజపేయి, అద్వానీనే కారణమన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం (Narendra modi Government) దళితులను పారిశ్రామిక వేత్తలుగా తయారుచేస్తోందని తెలిపారు. అంబేడ్కర్‌ ఆలోచనా విధానం వలనే భారతదేశానికి ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు లభించిందన్నారు. ఐక్యరాజ్యసమితి అంబేద్కర్‌ను పొగడటం దేశానికే గర్వకారణమన్నారు. జీవితమంతా పేదల కోసం పరితపించిన మహనీయుడు అంబేడ్కర్‌ అని కొనియాడారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. అంబేడ్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళటానికి కృషి చేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-04-14T12:21:29+05:30 IST